నోటితో మాట్లాడుతూ... నొసటితో వెక్కిరించి నట్లు... భారత్‌తో ఒకవైపు శాంతి చర్చలంటూనే చైనా మరోవైపు తన సేనలను సరిహద్దుల్లో చురుగ్గా కదిలిస్తోంది. డ్రాగన్ దుడుకు చర్యలకు పాకిస్థాన్ వంత పాడుతోంది. పాక్ ఆక్రమిత కశ్మీరు(పీవోకే)లోని స్కర్దు వైమానిక స్థావరంలో చైనా ఇంధన విమానమొకటి మోహరించింది. ఆ దేశానికి చెందిన గస్తీ విమానాలూ ముమ్మరంగా తిరుగుతున్నాయి. ఇందుకు దీటుగా భారత్ చైనా సరిహద్దు పొడవునా అప్రమత్తమైంది. తన వైమానిక సంపత్తిని, క్షిపణి వ్యవస్థలను మోహరించింది. ఆదేశాలు అందిన 8 నిమిషాల్లోనే దాడికి మన యుద్ధవిమానాలు సిద్ధంగా ఉన్నాయి. రెండు దేశాల పరస్పర యుద్ధ సన్నద్ధత వాతావరణంలో ఎప్పుడేం జరుగుతుందో అనే ఆందోళన నెలకొంది. భారత్‌తో ఉన్న సరిహద్దుల చేరువలోకి చైనా తన పర్వతారోహకులు, మార్షల్ ఆర్ట్స్ ఫైటర్లను దించింది. జమ్మూ-కశ్మీర్‌లో 370 అధికరణాన్ని రద్దు చేసి, లద్దాఖ్‌ను ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన కొద్దిరోజులకే చైనా కుయుక్తులు మొదలైనట్లు తెలుస్తోంది. ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ తన వాయుసేనకు అధునాతన ఆయుధ సంపత్తిని సమకూర్చేందుకు సన్నద్ధమైంది.
గల్వాన్‌లో డ్రాగన్ దాష్టీకం తర్వాత.. భారత్-చైనా సరిహద్దులో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఆ అగ్నికి ఆజ్యం పోస్తూ పొరుగుదేశం పాకిస్థాన్ చలి కాచుకుంటోంది. భారత్‌పై పగ తీర్చుకునే చర్యల్లో భాగంగా చైనాకు సైనికపరంగా సహాయ సహకారాలు అందిస్తోంది. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని స్కర్దు వైమానిక స్థావరంలో చైనా వాయు సేనను అనుమతించింది. డ్రాగన్‌కు చెందిన రీఫ్యూయెలర్ విమానం ఐఎల్-76 ఈ స్థావరంలో తిష్ఠవేసింది. యుద్ధవిమానాలకు గాల్లోనే ఇంధనం నింపడం దీని ప్రత్యేకత. ఇక చైనా గస్తీ విమానాలు సరిహద్దులో ముమ్మరంగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. పీవోకేలోని వైమానిక స్థావరాలను చైనా వాయుసేన విస్తృతంగా ఉపయోగించొచ్చన్న అంచనాలతో చర్యలు చేపట్టింది. మన యుద్ధ విమానాలు, గగనతల రక్షణ వ్యవస్థలను సరిహద్దుల్లోకి తరలించింది. లద్దాఖ్‌కు భారీగా అదనపు బలగాలు, సరకులను సరిహద్దుల్లోకి రవాణా చేయడంలో భారత వాయుసేన విమానాలు బిజీగా ఉన్నాయి.
ఐఎల్-78 ఎందుకు?
టిబెట్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో చైనా వాయుసేనకు అనేక వైమానిక స్థావరాలు ఉన్నాయి. వాటిలో ఎక్కువ శాతం.. సముద్ర మట్టానికి 4వేల అడుగుల ఎత్తులో ఉన్నాయి. అక్కడ ఆక్సిజన్ లభ్యత తక్కువ. అందువల్ల అక్కడి స్థావరాల నుంచి యుద్ధవిమానాలు ఎక్కువ బరువుతో టేకాఫ్ కాలేవు. ఫలితంగా తక్కువ ఆయుధాలు, ఇంధనంతోనే అవి పయనం కావాలి. దీనివల్ల అవి ఎక్కువ దూరం వెళ్లలేవు. పరిమిత స్థాయిలోనే దాడులు చేయగలవు. అందుకు భిన్నంగా భారత్‌లో వైమానిక స్థావరాలు పంజాబ్, హరియాణాలోని మైదాన ప్రాంతాల్లో ఉన్నాయి. ఇక్కడ్నుంచి యుద్ధవిమానాలు పూర్తి సామర్థ్యంతో ఇంధనం, ఆయుధాలను మోసుకెళ్లి, శత్రువుపై విరుచుకుపడగలవు. తన వైమానిక స్థావరాలు ఎత్తయిన ప్రాంతాల్లో ఉండటం వల్ల తలెత్తుతున్న ఇబ్బందిని ఇంధన ట్యాంకర్ విమానాల ద్వారా అధిగమించాలని చైనా భావిస్తోంది. ఇవి యుద్ధవిమానాలకు గాల్లోనే ఇంధనాన్ని నింపుతాయి.
మనకు చేరువలోనే..
స్కర్దు వైమానిక స్థావరాన్ని పాక్ ఇటీవల బాగా విస్తరించింది. అది లేహ్‌లోని మన వైమానిక కేంద్రానికి కేవలం 100 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. గత ఏడాది ఆగస్టులో పాకిస్థాన్‌కు చెందిన జెఎఫ్-17 యుద్ధవిమానాలు.. చైనాలోని హోటన్‌లో జరుగుతున్న యుద్ధవిన్యాసాల్లో పాల్గొనేందుకు వెళుతూ మధ్యలో ఇక్కడ ఆగాయి. ప్రస్తుతానికి స్కర్దులో పరిమిత స్థాయిలోనే చైనా కార్యకలాపాలు ఉన్నాయి. అయితే ఘర్షణ చోటుచేసుకుంటే పీవోకేలోని మరిన్ని వైమానిక స్థావరాలను పాక్.. డ్రాగన్‌కు ఇచ్చే అవకాశం ఉంది.
8 నిమిషాల్లోనే మన యుద్ధ విమానాలు సిద్ధం
చైనా వైమానిక దళంతో పోలిస్తే భారత వాయు సేన ఎక్కువ సంఖ్యలో యుద్ధవిమానాలను ఎల్‌ఏసీకి తరలించగలదు. మైదాన ప్రాంతాల్లో అనేక వైమానిక స్థావరాలు ఉండటమే ఇందుకు కారణం. తూర్పు లద్దాఖ్‌లోనే కాక చైనా వెంబడి ఉన్న సరిహద్దు ప్రాంతమంతటా భారత వైమానిక దళం తన అప్రమత్తతను కొనసాగిస్తోంది. ఆదేశం అందిన 8 నిమిషాల్లోనే దాడికి మన యుద్ధవిమానాలు సిద్ధంగా ఉన్నాయి. ఇరుకైన పర్వత మార్గాల్లో దాడి చేసే సామర్థ్యం మన పోరాట హెలికాప్టర్లకు ఉంది.
ఏమిటీ ట్యాంకర్ విమానం?
యుద్ధవిమానాల పోరాట పరిధిని పెంచడంలో ఇంధన ట్యాంకర్ విమానాలు సాయపడతాయి. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా ప్రధాన వైమానిక దళాలు వీటిని సమకూర్చుకుంటున్నాయి. యుద్ధవిమానం ఎక్కడ ఉన్నా.. ఇవి వెళ్లి గాల్లోనే వాటికి ఇంధనాన్ని నింపగలవు. చైనా 2005లో రష్యా నుంచి ఐఎల్-78 ఇంధన ట్యాంకర్ విమానాలను కొనుగోలు చేసింది. ఒక్కో విమానం దాదాపు 85 టన్నులకుపైగా ఇంధనాన్ని మోసుకెళ్లగలదు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన 'యుపాజ్-1' రీఫ్యూయెలింగ్ పాడ్ ద్వారా ఒక నిమిషంలోనే 3వేల లీటర్ల ఇంధనాన్ని అవతలి విమానంలోకి బట్వాడా చేయగలదు. భారత్ వద్ద కూడా ఆరు ఐఎల్-78 మిడాస్ ట్యాంకర్లు ఉన్నాయి. మరో ఆరింటిని సమకూర్చుకోవాలని మన దేశం యోచిస్తోంది.