ప్రపంచవ్యాప్తంగా చైనా టీకా దౌత్యం అద్భుతంగా పనిచేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 45 దేశాలకు దాదాపు 50 కోట్ల డోసుల కొవిడ్-19 వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తామని డ్రాగన్ ఇప్పటికే హామీ ఇచ్చింది. ఆ దేశం ఉత్పత్తి చేసిన టీకాలకు సంబంధించి బహిరంగంగా ఎలాంటి డేటా అందుబాటులో లేకపోవడం, వాటి సమర్థత, భద్రతపై అనుమానాలు ఉండటం, వ్యాక్సిన్లు సరఫరాకు ప్రత్యుపకారంగా చైనా ఏం కోరబోతోందన్నదానిపై సంశయాలు నెలకొన్నప్పటికీ ఈ పరిస్థితి ఉండటం గమనార్హం. డ్రాగన్ సరఫరా చేసిన టీకాలతో ఇప్పటికే 25కుపైగా దేశాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైంది. కొవిడ్ ప్రారంభ దశలో చైనా వ్యవహారశైలిపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ముద్రను చెరిపేసుకొని, మంచి పేరు తెచ్చుకోవడానికి ఆ దేశం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ఆందోళనలు ఉన్నా.. చైనా వ్యాక్సిన్లకు తగ్గని గిరాకీ - చైనా టీకా, భారత్ టీకా
చైనా సరఫరా చేసిన టీకాలతో 25కుపైగా దేశాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం ఊపందుకుంది. మహమ్మారి వ్యాప్తి కొనసాగిన తొలినాళ్లలో చైనా వ్యవహార శైలిపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో మంచి పేరు తెచ్చుకోవడానికి ఆ దేశం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకుగానూ 45 దేశాలకు దాదాపు 50 కోట్ల డోసుల కొవిడ్-19 వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తామని డ్రాగన్ ఇప్పటికే హామీ ఇచ్చింది.
భారత్, రష్యాల తరహాలో చైనా కూడా ఇదే తరహాలో టీకాలతో సౌహార్దతను సాధించాలని భావిస్తోంది. స్వదేశంలో పంపిణీ చేస్తున్న టీకాలకు పది రెట్లను విదేశాలకు సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. వీటిలో కొన్నింటిని విరాళంగా ఇస్తుండగా మిగతా వాటిని విక్రయిస్తోంది. ధనిక దేశాలు.. ఫైజర్, మోడెర్నా వంటి ఖరీదైన టీకాల వైపు మొగ్గడంతో అల్ప, మధ్యాదాయ దేశాలను చైనా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది దాదాపు 260 కోట్ల డోసులను ఉత్పత్తి చేస్తామని చైనాలోని నాలుగు అగ్రశ్రేణి టీకా ఉత్పత్తి కంపెనీలు పేర్కొన్నాయి. అయితే తాము టీకా దౌత్యానికి దిగడంలేదని, ప్రపంచ ఆరోగ్య పరిరక్షణ సాధనంగానే దాన్ని పరిగణిస్తున్నామని చైనా వాదిస్తోంది.