తెలంగాణ

telangana

ETV Bharat / international

చేరువైన అమెరికా చైనా.. వర్ధమాన దేశాలకు తీపి కబురు! - చైనా, అమెరికా

ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్దం సద్దుమణిగినట్లే ఉంది. గతంలో ఉప్పూ నిప్పుగా ఉన్న ఇరు దేశాలు... మన సంక్రాంతి పర్వదినాన తొలి దశ వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేయడంతో ఉద్రిక్తతలు కొంతన్నా ఉపశమించి ప్రపంచార్థికం తేరుకొనే అవకాశాలపై కొత్త ఆశలు మోసులెత్తుతున్నాయి. ఆంబోతుల పోరులో నలిగే లేగల్లా అవస్థల పాలవుతున్న వర్ధమాన దేశాలకు తీపి కబురే ఇది!

china-us-agrees-to-trade-deal-dot-dot-dot-sweet-news-to-the-developing-countries
చేరువైన అమెరికా చైనా.. వర్ధమాన దేశాలకు తీపి కబురు!

By

Published : Jan 17, 2020, 6:49 AM IST

'వాణిజ్య ఒప్పందానికి చైనా ఇప్పుడే సిద్ధపడాలి... రెండోసారి అధ్యక్షుడిగా నేను ఎన్నికయ్యేవరకు ఆగాలనుకొంటే ఆ ఒప్పందం వారికి మరింత కఠినంగా ఉంటుంది'- నిరుడు మే నెల రెండోవారంలో శ్వేతసౌధాధిపతి డొనాల్డ్‌ ట్రంప్‌ బీజింగ్‌ నేతాగణానికి చేసిన హెచ్చరిక అది. ముఖ్యమైన వాణిజ్యాంశాలపై అమెరికాకు ఎలాంటి రాయితీలూ ఇచ్చేది లేదని అప్పుడే చైనా కరాఖండిగా ప్రకటించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా తొలి రెండుస్థానాల్లో ఉన్న అమెరికా, చైనాల నడుమ వాణిజ్యస్పర్థ- అంతర్జాతీయ మాంద్యానికీ ఎరువవుతున్న వేళ ఎట్టకేలకు వాషింగ్టన్‌ బీజింగులు ప్రాప్తకాలజ్ఞత ప్రదర్శించాయి.

సంతకాలతో చెక్​...

అమెరికా చైనాలు మన సంక్రాంతి పర్వదినాన తొలి దశ వాణిజ్య ఒప్పందంపై చేవ్రాలు చేయడంతో ఉద్రిక్తతలు కొంతన్నా ఉపశమించి ప్రపంచార్థికం తేరుకొనే అవకాశాలపై కొత్త ఆశలు మోసులెత్తుతున్నాయి. అధ్యక్షుడు ట్రంప్‌, చైనా ఉపప్రధాని లీ సంతకాలు చేసిన 86 పేజీల ఒప్పందానుసారం- 2018లో గరిష్ఠంగా చైనాతో నమోదైన అమెరికా వాణిజ్యలోటు 42,000 కోట్ల డాలర్లను తగ్గించేలా రెండేళ్లపాటు 20,000 కోట్ల డాలర్ల మేర అగ్రరాజ్యం నుంచి అదనపు కొనుగోళ్లకు బీజింగ్‌ తలూపింది. చైనా నుంచి వచ్చే 12,000 కోట్ల డాలర్ల వస్తూత్పత్తులపై సుంకాల్ని తనవంతుగా సగానికి తగ్గించనున్న అమెరికా, అదనపు పన్ను విధింపు ప్రతిపాదనల్ని అటకెక్కించింది.

అత్యంత కీలకాంశాలతో ముడివడిన మలివిడత ఒప్పందం ఈ ఏడాది చివర్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల తరవాతే ఉంటుందన్న వార్తాకథనాల్నిబట్టి- ప్రస్తుత ఒడంబడికకు ఇరు దేశాల రాజకీయ ఆర్థిక అవసరాలే ప్రేరకమయ్యాయన్న సంగతి బోధపడుతూనే ఉంది. ఆంబోతుల పోరులో నలిగే లేగల్లా అవస్థల పాలవుతున్న వర్ధమాన దేశాలకు తీపి కబురే ఇది!

అగ్రరాజ్యానికి దీటుగా చైనా...

నాటి సోవియెట్‌ యూనియన్‌తో పాటే ప్రచ్ఛన్న యుద్ధమూ కాలగర్భంలో కలిసిపోయిన నేపథ్యంలో, 1992లో అమెరికా అధికార గణం రూపొందించిన రక్షణ విధాన మార్గదర్శక ముసాయిదా ‘దుర్నిరీక్ష్య అమెరికా’ను ప్రస్తావించింది. 1978లో ఆర్థిక సంస్కరణలకు చైనా లాకులెత్తాక అక్కడి విస్తృత విపణిని ఒడిసిపట్టడానికి అమెరికా అధినేతలు, బహుళజాతి సంస్థలు చేసిన విస్తృత యత్నాలు జనచైనాను ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చేశాయి. 1990లో ప్రపంచవ్యాప్త వస్తూత్పత్తుల విలువలో మూడు శాతంకంటే తక్కువే తయారుచేసిన చైనా- నేడు నాలుగోవంతుకు పైగా వాటాతో అగ్రరాజ్యానికి దీటుగా ఎదిగింది.

1985లో అమెరికాతో 600 కోట్ల డాలర్ల వాణిజ్య మిగులు సాధించిన బీజింగ్‌- 2018లో 420 బిలియన్‌ డాలర్లకు మించింది! ‘ప్రపంచ చరిత్రలోనే కనీవినీ ఎరుగని దోపిడి’గా ఈ వాణిజ్య అసమతూకాన్ని 2016లో తూలనాడిన ట్రంప్‌, ఆ మరుసటి సంవత్సరం చైనా అధ్యక్షుడితో కలిసి వివాదాల పరిష్కారానికి వందరోజుల కార్యాచరణనూ ప్రకటించారు. దానివల్ల ప్రయోజనం లేకపోయేసరికి చైనా దిగుమతులపై సుంకాల మోతతో అమెరికా రెచ్చిపోయింది. తాను సైతం వెనక్కి తగ్గేదిలేదంటూ అమెరికా దిగుమతుల్ని చైనా అడ్డుకోవడంతో అగ్రరాజ్యంలో వ్యవసాయ రంగం పెను సంక్షోభంపాలై రైతుల ఆత్మహత్యలూ ముమ్మరించాయి.

ట్రంప్​ రాజకీయావసరమేనా...!

ఎన్నికల ఏడాదిలో, అభిశంసన ప్రక్రియ గుదిబండగా మారిన దశలో చైనా మీద పైచేయి చాటుకొనే ఒప్పందం ట్రంప్‌కు తక్షణ రాజకీయావసరంగా మారింది. తైవాన్‌, హాంకాంగ్‌, దక్షిణ చైనా సముద్ర ప్రాంతాల్లో రాజకీయంగా పెనుసవాళ్లు ఎదుర్కొంటున్న చైనా- ఇచ్చిపుచ్చుకొనే వ్యూహంతోనే దారికొచ్చిందన్న వాస్తవం తేటపడుతూనే ఉంది!

అత్యున్నత ఆశయాలతో ఆరంభమైన ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) రజతోత్సవ సంవత్సరమిది. ఒంటెత్తు వాణిజ్య ధోరణుల్ని అరికట్టి, అసమాన పోటీకి తెరదించి, అభివృద్ధి చెందుతున్న దేశాలకు పోటీలో నిలదొక్కుకోగల అవకాశం కల్పించి, అందరి ఉన్నతికీ పాటుపడాలన్న సదాశయంతో డబ్ల్యూటీఓ నిబంధనావళి గుబాళించింది. అందరికీ లబ్ధి చేకూరేలా స్వేచ్ఛావాణిజ్యం సాగాలన్న లక్ష్యానికి పెద్ద దేశాల పెరపెరలే తూట్లు పొడుస్తుంటే- ప్రపంచ వాణిజ్య సంస్థ ఉండీ ఏం ఉద్ధరిస్తోందన్న సందేహం కలగక మానదు. దాన్ని నిస్సారం చెయ్యడానికి ఇటీవల అమెరికా తెరచాటు కుహకాలూ ఇన్నీ అన్నీ కావు. నువ్వు ఒకందుకు పోస్తే నేను ఒకందుకు తాగానన్నట్లుగా అమెరికా చైనాలు తమ మధ్య వాణిజ్యస్పర్థ మరో ప్రచ్ఛన్నయుద్ధం స్థాయికి వెళ్లకుండా జాగ్రత్తపడటం మంచిదే అయినా- ఏటా లక్షా 10 వేలకోట్ల డాలర్ల వాణిజ్యం జరిగే ఈయూతోనూ అగ్రరాజ్యానికి గొడవలున్నాయి.

ఉభయతారక ఒప్పందం...

ఇండియాతోనూ వాణిజ్య కయ్యానికి కాలుదువ్విన ట్రంప్‌- ఉభయతారక ఒప్పందానికి మొగ్గుతున్నట్లు వార్తాకథనాలు చాటుతున్నాయి. రైతుల ఆదాయాలు రెట్టింపు; వ్యవసాయం-గ్రామీణాభివృద్ధికి రూ.25 లక్షల కోట్ల ఖర్చుకు ఏయే పథకాలు రచించారు?’ అని ఐరోపా సంఘం ఏడు నెలల క్రితం ఇండియాను ప్రశ్నించింది. భారత ప్రభుత్వం గోధుమకు మద్దతు ధర ఎందుకు పెంచాల్సి వచ్చిందో, రికార్డు స్థాయిలో ఎందుకు సేకరిస్తోందో చెప్పాలని అమెరికా కోరుతోంది. స్వప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యం’ అంటూ వాణిజ్య యుద్ధాలకు తెగబడుతున్న అగ్రరాజ్యాలు- ఇండియా మరేమాత్రం వర్ధమాన దేశం కాదన్న వితండ వాదనలతో సహేతుక రాయితీలనూ నిలదీసి ప్రశ్నిస్తున్నాయి. ఈ అభిజాత్య పోకడలు మలిగిపోతేనే- సమతులాభివృద్ధి అన్ని దేశాలకూ చేరుతుంది!

ABOUT THE AUTHOR

...view details