ప్రాణాంతక కరోనా వైరస్... చైనాలో వేగంగా విస్తరించడం, మృతుల సంఖ్య పెరగడం వల్ల తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు అక్కడి ప్రజానీకం. ఈ క్రమంలో వైరస్ వ్యాప్తి నియంత్రించేందుకు చర్యలు ముమ్మరం చేసింది ప్రభుత్వం.
ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రాకూడదని ఆదేశాలు జారీ చేసిన చైనా ప్రభుత్వం... మరో నిర్ణయాన్ని ప్రకటించింది. పెళ్లిళ్లు వాయిదా వేసుకోవాలని ప్రజలను కోరింది. వివాహ వేడుకల వల్ల వైరస్ వ్యాప్తి పెరుగుతుందనే ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రత్యేక తేదీ
ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది. '02022020' ఎటునుంచి చూసిన ఒకే నెంబరు రావడం ఈ తేదీ ప్రత్యేకత. అందువల్లే ఎక్కువ మంది ఆ రోజునే వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. అంతే కాకుండా సెలవు రోజు కూడా కావడం... వివాహ వేడుకలకు కలిసొచ్చింది. ఈ నేపథ్యంలో దేశంలో బీజింగ్, షాంఘై వంటి ప్రధాన నగరాల్లో పౌరులు ఎక్కువ మంది పెళ్లిళ్ల కోసం ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక తేదీల్లో పెళ్లిళ్లను వాయిదా వేసుకోవాలని సూచించింది.