కరోనాకు పుట్టినిల్లైన చైనాలో రెండు నెలల తర్వాత మళ్లీ కొత్త కేసులు నమోదయ్యాయి. కిండావ్ నగరంలో 9 మందికి పాజిటివ్‌గా తేలింది. వీరిలో 8మంది ప్రభుత్వ ఛాతి ఆస్పత్రిలోని రోగులు కాగా.. మరొకరు బయటి కుటుంబానికి చెందివారు.
వైరస్ కేసులు లేవని ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆంక్షలు ఎత్తివేసింది చైనా. తాజా కేసులతో అప్రమత్తమైంది. వైరస్ ఎలా వ్యాప్తి చెందిందనే విషయంపై విచారణ చేపట్టింది. కేసులు నమోదైన నగరంలో 5 రోజుల్లోనే 90 లక్షల మందికి పరీక్షలు నిర్వహించనున్నట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకటించింది.
చైనాలో ఇప్పటివరకు మొత్తం 85,578 కేసులు నమోదయ్యాయి. 4,634మంది వైరస్‌కు బలయ్యారు. ఆగస్టు 15న ఉరుంకి నగరంలో నలుగురికి పాజిటివ్‌గా తేలిన తర్వాత ఇప్పటి వరకు కొత్త కేసులు వెలుగు చూడలేదు. విదేశాల నుంచి వచ్చిన వారిలో కొంత మందికి వైరస్ నిర్ధరణ అయినప్పటికీ స్థానికులు ఎవరూ లేరు. విదేశీయులకు 14 రోజుల క్వారంటైన్ నిబంధన ఇంకా అమల్లో ఉంది.