నేపాల్ రాజకీయాల్లో చైనా మరోసారి తలదూర్చనుంది. ప్రధాని కేపీ శర్మ ఓలి.. పార్లమెంటును అర్ధాంతరంగా రద్దు చేసిన అనంతరం ఆ దేశంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఓలి వర్గం, ప్రచండ(పుష్ప కుమార్ దహల్) వర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరి నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో చీలికలు ఏర్పడే పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో చైనా రంగంలోకి దిగి దీన్ని అడ్డుకోవాలని భావిస్తోంది. చైనీస్ కమ్యూనిస్టు పార్టీ వైస్ మినిస్టర్ నేతృత్వంలో నలుగురు సభ్యులను ఆదివారం కాఠ్మాండూకు పంపనుంది. నేపాల్ రాజకీయ పరిస్థితులపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టనుంది.
ఎన్సీపీకి చెందిన నాయకులు ఈ విషయాన్ని ధ్రువీకరించారని కాఠ్మాండూ పోస్ట్ న్యూస్ పేపర్ కథనం ప్రచురించింది. చైనీస్ కమ్యూనిస్టు పార్టీ వైస్ మినిస్టర్ గువో యెజోవ్ కాఠ్మాండూకు ఆదివారం చేరుకుంటారని వారు చెప్పినట్లు పేర్కొంది. అయితే ఈ విషయంపై నేపాల్లోని చైనా రాయబార కార్యాలయం మాత్రం స్పందించడం లేదని వార్తా పత్రిక తెలిపింది.
నాలుగు రోజులు మకాం..
చైనీస్ కమ్యూనిస్టు పార్టీ బృందం కాఠ్మాండూలోనే 4 రోజులు మకాం వేసి ఎన్సీపీలోని ఓలి, ప్రచండ వర్గం నేతలతో చర్చలు జరుపుతుందని నేపాల్ వార్తా సంస్థ పేర్కొంది. సమస్యను పరిష్కరించి పార్టీ చీలిపోకుండా ఆపేందుకు ప్రయత్నిస్తుందని పేర్కొంది. నేపాల్లోని చైనా రాయబారి ఇప్పటికే ప్రచండ వర్గం నేతలతో చర్చలు జరిపారు. ఇప్పుడు చైనీస్ కమ్యూనిస్టు పార్టీ నేతలు రంగంలోకి దిగనున్నారు.