జనవరి 31లోగా చైనా కరోనా నిరోధక వ్యాక్సిన్ సైనోఫామ్ పాకిస్థాన్‌కు చేరనున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషి తెలిపారు. చైనా 5లక్షల డోసులను పంపనున్నట్లు.. ఆ దేశ ప్రతినిధులతో మాట్లాడిన అనంతరం ట్విట్టర్లో వెల్లడించారు. ఫిబ్రవరి నెలాఖరులోగా 1.1మిలియన్ల వ్యాక్సిన్‌లు సరఫరా చేసుకోనున్నట్టు పేర్కొన్నారు ఖురేషి.
"దేశానికి నేను ఒక శుభవార్తను చెప్పాలనుకుంటున్నాను. పాక్‌కు 5లక్షల వ్యాక్సిన్ డోసులను ఇస్తానని చైనా మనకు మాటిచ్చింది. జనవరి 31లోగా వ్యాక్సిన్‌లు ఇక్కడికి చేరతాయి." అని ఖురేషి తెలిపారు. వ్యాక్సిన్‌లు పంపేందుకు తమ దేశం నుంచి ఒక విమానాన్ని బీజింగ్‌కు పంపాలని చైనా ప్రభుత్వం కోరినట్టు చెప్పారు. మొదటి బ్యాచ్ వ్యాక్సిన్లను తమ దేశంతో ఉన్న స్నేహం కారణంగా ఉచితంగా సరఫరా చేస్తోందని పేర్కొన్నారు ఖురేషి.