గూఢచర్యానికి వ్యతిరేకంగా చైనా కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. వీటి ప్రకారం- విదేశీ చొరబాట్లకు అనువుగా ఉండే సంస్థలు, కంపెనీల జాబితాను రూపొందించే అధికారం జాతీయ భద్రతా విభాగానికి దఖలు పడుతుంది. ఆయా సంస్థల్లో ఉద్యోగాల్లో చేరేముందు.. జాతీయ భద్రతకు సంబంధించి అభ్యర్థులు తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దేశ భద్రతకు తమ వంతు ఏం చేయాలన్నది యాజమాన్యాలు వారికి అవగాహన కలిగిస్తాయి. విదేశాలకు వెళ్లాల్సిన పక్షంలో.. అక్కడికి వెళ్లడానికి ముందు, వెళ్లి వచ్చిన తర్వాత కూడా వారిని ఇంటర్వ్యూ చేయాల్సి ఉంటుంది.
జాతీయ భద్రత కోసమే..
ఈ అంశంపై 'చైనా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాంటెంపరరీ ఇంటర్నేషనల్ రిలేషన్స్'కు చెందిన జాతీయ భద్రత నిపుణుడు లీ వీ స్పందించారు. "విదేశీ గూఢచారులతో పాటు.. నిఘా సంస్థలు, శత్రు శక్తులు కూడా విభిన్న మార్గాల్లో చైనాకు చెందిన పలు రంగాల్లో చొరబాట్లను, చౌర్యాన్ని ముమ్మరం చేశాయి. విదేశీ గూఢచర్యానికి సంబంధించి 'ఎవరు? ఏమిటి? ఎలా?' అన్న విషయాల్లో స్పష్టత తెచ్చేందుకు కొత్త నిబంధనలు దోహదపడతాయి. ఆయా సంస్థలకు స్పష్టమైన బాధ్యతలు ఉంటాయి గనుక.. జాతీయ భద్రతను కాపాడేందుకు అవి మరింతగా దోహదపడతాయి" అని లీ పేర్కొన్నారు.
ఇవీ చదవండి:చైనాలో 20 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్
'ద్వైపాక్షిక సంబంధాలపై దృష్టి పెట్టండి'