కరోనా కారణంగా ఈ ఏడాది నిలిచిపోయిన చైనా పార్లమెంట్ వార్షిక సమావేశాన్ని 2021 మార్చి 5న నిర్వహించనున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. దేశంలోని కీలక అడ్వైజరీ అయిన.. చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్‌తో సంయుక్తంగా జరిగే ఈ సమావేశాలు రెండు వారాల పాటు కొనసాగుతాయి. చైనా ప్రీమియర్ లీ కెకియాంగ్ సమర్పించే నివేదికను ఆమోదించిన తర్వాత.. జాతీయ అజెండాను పార్లమెంట్ నిర్దేశిస్తుంది.
అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ దీర్ఘకాలిక వ్యూహాత్మక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు 2035 నాటికి సాధించాల్సిన లక్ష్యాలతో రూపొందించిన 14వ పంచవర్ష ప్రణాళికను ఆమోదించడం ఈ సమావేశంలో కీలక అజెండాగా ఉండనుంది. కీలకమైన చట్టాలకు ఈ సమావేశంలో ఆమోదం లభించనుంది. ఇందుకు సంబంధించిన ప్రణాళికలకు చైనా కమ్యునిస్టు పార్టీ(సీపీసీ) ఇదివరకే ఆమోద ముద్ర వేసింది. వార్షిక మిలిటరీ బడ్జెట్‌ను సైతం ఈ సమావేశాల్లో ప్రకటించనుంది. 2027 నాటికి అమెరికాకు ధీటుగా తన సైన్యాన్ని తయారుచేసుకోవాలన్న ప్రణాళికకు సీపీసీ ఇదివరకే ఆమోదం తెలిపింది. కేంద్ర, స్థానిక బడ్జెట్‌ను అమలు చేసే అంశంపైనా పార్లమెంట్ చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.