ప్రపంచ శక్తిగా ఎదగాలని చూస్తున్న చైనా.. తిరుగులేని రక్షణ వ్వవస్థను రూపొందించేందుకు సిద్ధమవుతోంది. బీజింగ్‌లోని హువారౌ జిల్లాలో హైపర్సోనిక్ విండ్ టన్నెల్‌ను చైనా ఏర్పాటు చేసిందని మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో అమెరికా కీలక విషయాన్ని వెల్లడించింది. డీఎఫ్-17 క్షిపణితో హైపర్సోనిక్ గ్లైడ్ వాహనం డీఎఫ్-జడ్ఎఫ్ను జత చేసే ప్రయత్నాలను డ్రాగన్ దేశం కొనసాగిస్తోందని అగ్రరాజ్యం రక్షణ శాఖ నివేదికలో తెలిపింది. ఇందుకోసం చైనా భారీగా వెచ్చిస్తున్నట్లు పేర్కొంది.
బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థను కూడా తప్పించుకోవాలనే లక్ష్యంతోనే చైనా డీఎఫ్-17/డీఎఫ్-జడ్ఎఫ్ను పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది విజయవంతమైతే మొట్టమొదటి మధ్య స్థాయి హైపర్సోనిక్ గ్లైడ్ వాహనం ఇదే అవుతుంది. డీఎఫ్-17(డాంగ్ ఫెంగ్-17) మధ్యస్థాయి క్షిపణి వ్యవస్థ. ఇది ధ్వనికంటే 5-12 రెట్లు వేగంగా ప్రయాణించగలదు. అంటే సెకనుకు 1.72-3.43 కిలోమీటర్లు దూసుకెళ్లగలదు. చైనా 70వ వార్షిక పరేడ్ సందర్భంగా 2019లో తొలిసారి దీన్ని ప్రదర్శించారు.
డీఎఫ్-41.. అణు హైపర్సోనిక్ గ్లైడ్‌ను మోయగలదని అమెరికా మిలిటరీ కమాండర్ 2020లో తెలిపినట్లు నివేదిక గుర్తు చేసింది. బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థలు, ఇంటెలిజెన్స్-సర్వైలెన్స్-రికనైసెన్స్ (ఐఎస్ఆర్) వ్యవస్థలను దీటుగా ఎదుర్కోవడమే కాక, ప్రత్యర్థి అమెరికా శక్తి సామర్థ్యాలను తలదన్నేలా అధునాతన హైపర్సోనిక్ గ్లైడ్ వాహనాలను అభివృద్ధి చేయడానికి చైనా భారీగా ఖర్చు చేస్తున్నట్లు పేర్కొంది.
వేగం, కచ్చితత్వంతో పాటు తిరుగులేని శక్తి సామర్థ్యాలున్న ఈ ఆయుధాలను అడ్డుగోవడం, గుర్తించడం, ట్రాక్ చేయడం క్లిష్టతరమవుతుంది. హైపర్సోనిక్తో పాటు డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ రైల్ గన్స్, అంతరిక్ష ఆధారిత మిలిటరీ సామర్థ్యాలు చైనా వద్ద ఉన్న ఇతర కీలక సాంకేతికతలు.
మీడియా కథనాల ప్రకారం.. జెఎఫ్-22 అని పిలిచే ఈ హైపర్సోనిక్ విండ్ టన్నెల్‌కు ధ్వని కన్నా 30 రెట్ల వేగంతో ఫ్లైట్స్‌ను సిములేట్ చేసే సామర్థ్యం ఉంది. ఇది అమెరికా కంటే అధికం. ఈ తరహా పరీక్షా సొరంగాలు హైపర్సోనిక్ ఆయుధాల అభివృద్ధికి చాలా కీలకం. చైనా ఏరోస్పేస్ సైన్స్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పనిచేసే 'నియర్ స్పేస్ ఫ్లైట్ వెహికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్' వద్ద హైపర్సోనిక్ గ్లైడ్ వాహనాలను అభివృద్ధి చేస్తున్నారు.
అమెరికా అమితాసక్తి
హైపర్సోనిక్ గ్లైడ్ ప్రాముఖ్యాన్ని తెలుసుకున్న అమెరికా దీనిపై చురగ్గా ప్రయోగాలు జరుపుతోంది. మరోవైపు రష్యా ఇలాంటి ఆయుధాన్ని మోహరించినట్లు 2019లోనే ప్రకటించింది. హైపర్సోనిక్ సంబంధిత పరిశోధనల కోసం 2020-21లో ఏకంగా 3.2 బిలియన్ డాలర్ల భారీ బడ్జెట్‌ను కేటాయించిన అమెరికా 2021-22లో దాన్ని 3.8 బిలియన్ డాలర్లకు పెంచింది. దీంతో అధునాతన హైపర్సోనిక్ సాంకేతికత పట్ల ఆగ్రరాజ్యం ఎంత ఆసక్తిగా ఉందో స్పష్టమైంది.