అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నాలుగేళ్ల పాలనలో విలవిలలాడింది చైనా. వాణిజ్య యుద్ధం నుంచి కరోనా సంక్షోభం వరకు అనేక సందర్భాల్లో చైనాపై కఠినంగా వ్యవహరించారు ట్రంప్. అయితే ఇంకొన్ని రోజుల్లో ట్రంప్ ఆ పదవి నుంచి తప్పుకోనున్నారు. అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నిక ఎన్నికల విజేత జో బైడెన్ ఆ పీఠాన్ని అధిరోహించనున్నారు. కానీ చైనా పరిస్థితి మాత్రం మారేలా కనిపించడం లేదు. ఆ దేశంపై బైడెన్ మరింత కఠినంగా వ్యవహరించి, మరిన్ని ఆంక్షలు విధించే అవకాశముందని ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో చైనా అప్రమత్తమైంది. జో బైడెన్‌తో బంధాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకోసం చర్చల ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది.
అన్ని స్థాయిల్లో అమెరికా-చైనా చర్చలు జరపాలని పిలుపునిచ్చారు చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీ. అమెరికా-చైనా వ్యాపార మండలి బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
"సంప్రదింపులు జరిపేందుకు చైనా ఎప్పుడూ సిద్ధమే. చర్చలు జరపాల్సిన అంశాల జాబితాను రూపొందించవచ్చు. ఒకరికి ఒకరు సహకరించుకుంటూ విభేదాలను పరిష్కరించుకోవచ్చు. దీర్ఘకాల విషయాలు, వ్యూహాత్మక అంశాలపై ఇరుదేశాలు ఎప్పటికప్పుడు అవగాహన పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది."
--- వాంగ్ యీ, చైనా విదేశాంగమంత్రి.