సొంత అంతరిక్ష కేంద్రం విస్తరణ దిశగా మరో కీలక ముందడుగు వేసింది చైనా. షెంఝౌ-12 స్పేస్‌క్రాఫ్ట్ ద్వారా ముగ్గురు వ్యోమగాములను స్పేస్ స్టేషన్ కోర్ మాడ్యూల్ టియాన్ హేకు పంపించింది. వాయవ్య చైనా గోబి ఎడారి ప్రాంతంలోని జియుక్వాన్ ఉపగ్రహ కేంద్రం నుంచి.. లాంగ్ మార్చ్-2ఎఫ్ క్యారియర్ రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్లు చైనా అధికారిక టీవీ ఛానల్ సీజీటీఎన్ వెల్లడించింది. ఈ రాకెట్ సురక్షితంగా నిర్దేశిత కక్ష్యలోకి చేరుకుందని స్పష్టం చేసింది.
రోదసీలోకి వ్యోమగాములను పంపడం చైనాకు ఇది ఏడోసారి కాగా.. అంతరిక్ష కేంద్రం విస్తరణ కోసం పంపడం ఇదే తొలిసారి. ఈ విషయాన్ని చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ(సీఎమ్ఎస్ఏ) వెల్లడించింది.
ముగ్గురు వీరే..
ముగ్గురు వ్యోమగాములు.. నే హెషాంగ్(56), లూ బామింగ్(54), టేంగ్ హంగ్బో(45) అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు.
- హెషాంగ్.. షెంఝౌ-7, షెంఝౌ-10 మిషన్‌లో పాలుపంచుకున్నారు.
- లూ బామింగ్.. షెంఝౌ-7 మిషన్ కోసం పనిచేశారు.
- టేంగ్ హంగ్బోకు ఇదే తొలి స్పేస్ మిషన్ కావడం గమనార్హం.
మూడు నెలలు ఏం చేస్తారు?
అంతరిక్ష కేంద్రం విస్తరణ కోసం ఏప్రిల్‌లో పంపిన కోర్ మాడ్యూల్ టియాన్ హేలో ఉంటూ.. ముగ్గురు వ్యోమగాములు మూడు నెలల పాటు శాస్త్రపరిశోధనలు, మరమ్మతులతో పాటు.. స్పేస్‌వాక్‌లు చేయనున్నారు.
అంతరిక్ష కేంద్రంలో ముఖ్యంగా వీరు 4 పనులు పూర్తి చేయాల్సి ఉంది.
- టియాన్ హే మాడ్యూల్ ఇన్ ఆర్బిట్ టెస్ట్
- రీసైక్లింగ్ అండ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ వెరిఫికేషన్
- రొబోటిక్ ఆర్మ్ టెస్టింగ్ అండ్ ఆపరేషన్ ట్రైనింగ్
- మేనేజ్మెంట్ ఆఫ్ మెటీరియల్ అండ్ వేస్ట్.