రోదసిలో నిర్మిస్తున్న తన అంతరిక్ష కేంద్రానికి ఆహారం, ఉపకరణాలు, ఇంధనాన్ని మోసుకెళుతూ చైనా వ్యోమనౌక శనివారం విజయవంతంగా నింగిలోకి పయనమైంది. తియాన్‌ఝౌ-2 అనే ఈ సరకు రవాణా వ్యోమనౌకను లాంగ్ మార్చ్-7 వై3 రాకెట్ ద్వారా ప్రయోగించారు. హైనాన్ ప్రావిన్స్‌లోని వెన్చాంగ్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది.
నిజానికి గతవారమే ఈ యాత్ర జరగాల్సి ఉన్నప్పటికీ సాంకేతిక సమస్య వల్ల వాయిదాపడింది. తియాన్హే పేరుతో భూ కక్ష్యలో ఒక అంతరిక్ష కేంద్రాన్ని చైనా నిర్మిస్తోంది. ఇప్పటికే దానికి సంబంధించిన ముఖ్య భాగం రోదసిలోకి చేరింది. తాజాగా ప్రయోగించిన తియాన్‌ఝౌ-2.. ఆ భాగంతో అనుసంధానమవుతుంది. దాదాపు 160 ప్యాకేజీలను అంతరిక్ష కేంద్రంలోకి బట్వాడా చేస్తుంది. భవిష్యత్‌లో అక్కడికి రాబోయే వ్యోమగాముల కోసం ఆహారం, సరకులు సైన్స్ పరికరాలు,అంతరిక్ష కేంద్రం కోసం రెండు టన్నుల ఇంధనం వంటివి ఇందులో ఉన్నాయి. షెంఝౌ-12 అనే వ్యోమనౌక ద్వారా త్వరలో ముగ్గురు వ్యోమగాములు ఇక్కడికి పయనమవుతారు. వారు మూడు నెలల పాటు అందులోనే ఉంటారు.