వాస్తవాధీన రేఖ ఆవల చైనా చర్యలు భారత్‌కు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇటీవల భారత్‌కు మిత్రదేశమైన భూటాన్‌తో సరిహద్దు వివాదాల పరిష్కారం కోసం చైనా ఓ అవగాహనకు వచ్చింది. ఈ క్రమంలో భారత్‌లోని సిలిగుడి కారిడార్‌ను(చికెన్స్ నెక్)(Siliguri corridor) లక్ష్యంగా చేసుకుని కుట్రలు పన్నుతోంది. ఇప్పటికే రోడ్ల నిర్మాణాలను వేగవంతం చేసింది. దీంతో భారత్ వర్గాల్లో కూడా ఆందోళన పెరుగుతోంది. ఇటీవల ఈస్టర్న్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే కూడా చికెన్స్ నెక్ ఎంతో 'సున్నితమైంది' అని అంగీకరించారు.
వ్యూహాత్మకంగా ఎందుకు ముఖ్యం..
ఈశాన్య భారత్‌లోని ఎనిమిది రాష్ట్రాలకు వెళ్లేందుకు రైలు, రోడ్డు మార్గాలు ఈ ప్రదేశం నుంచి వెళతాయి. దీంతోపాటు కీలక పైప్‌లైన్లు, కమ్యూనికేషన్ కేబుల్స్‌కు ఇదే మార్గం. పశ్చిమ బంగాల్‌లో ఉన్న ఈ ప్రాంతంలో కొంత భాగం కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు ఉంది. నేపాల్ , భూటాన్, బంగ్లాదేశ్‌కు అత్యంత సమీపంలో ఉంది. చైనాకు చెందిన చుంబీ లోయ దీనికి అత్యంత సమీపంలోనే ఉంది. ఈ ప్రదేశంపై దాడి చేసి భారత్ నుంచి ఈశాన్య రాష్ట్రాలను వేరుచేసే ప్రమాదం ఉందని సైనిక వ్యూహకర్తలు కొన్ని దశాబ్దాలుగా ఆందోళన చెందుతున్నారు. ఇదే జరిగితే ఈశాన్య ప్రాంతాల్లోని సైనిక దళాలకు సరఫరాలు కష్టమైపోతాయి. డొక్లాం ట్రై జంక్షన్ వద్ద చైనా రోడ్డు నిర్మాణాలను భారత్ దళాలు అడ్డుకోవడానికి గల ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటి.
భూటాన్‌తో ఎంవోయూపై ఆందోళనలు..
పొరుగు దేశమైన భూటాన్ భద్రతకు భారత్ హామీ ఇస్తోంది. డోక్లాం ఘటన తర్వాత చైనా నిర్మాణాల వేగాన్ని పెంచింది. భూటాన్ భూభాగంలోని టోర్సా నది సమీపంలో చైనా రోడ్లను నిర్మిస్తున్నట్లు గతేడాది ఉపగ్రహ చిత్రాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా భూటాన్-చైనా మధ్య సరిహద్దు వివాదాన్ని మూడు అంచెల్లో పరిష్కరించుకోవడానికి అవగాహన ఒప్పందం కుదిరింది. ఒప్పంద వివరాలు బహిర్గతం కాలేదు. ఈ ఒప్పందాన్ని మోదీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా చైనాకు చెందిన సీజీటీఎస్ పేర్కొంది. చైనా మీడియాలోని ఇతర వార్తాసంస్థల్లో కూడా ఇదే విధంగా కథనాలు వెలువడటం గమనార్హం.
చుంబీ లోయవైపు ఉన్న భూటాన్ భూమి చైనా చేతిలోకి వెళితే.. డోక్లాం ట్రై జంక్షన్ వద్ద పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పట్టు పెరిగిపోతుంది. దీంతో చైనా చుంబీ లోయలో శతఘ్నులు, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ క్షిపణులు, యుద్ధవిమానాలను సిలిగుడి లక్ష్యంగా మోహరించే ప్రమాదం ఉంది.