చైనా వైఖరిని విమర్శిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అధ్యక్షుడు టెడ్రోస్ అథనోమ్ చేసిన వ్యాఖ్యలపై డ్రాగన్ స్పందించింది. ఎక్కడో అపార్థం జరిగి ఉండొచ్చని భావిస్తున్నామని తెలిపింది. ఈ మేరకు చైనా విదేశాంగ ప్రతినిధి హువా చున్యింగ్ బుధవారం స్పష్టం చేశారు. డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధుల పర్యటనకు అనుమతించడంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వని చైనా, ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
"డబ్ల్యూహెచ్ఓ బృందం పర్యటన తేదీల ఖరారుపై ఇరు పక్షాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. త్వరలోనే ఈ విషయంపైన స్పష్టత వస్తుందని ఆశిస్తున్నాను. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని అర్ధం చేసుకుంటుందని భావిస్తున్నాము.
టెడ్రోస్ వ్యాఖ్యలను అర్ధం చేసుకోగలం, కానీ ఎప్పుడైనా ఇతర ప్రాంతాల్లో పర్యటించాలని అనుకున్నప్పుడు ముందుగా ఆ విషయంపై అవతలి వారితో చర్చించాలి."
-హువా చున్యింగ్, చైనా విదేశాంగ ప్రతినిధి