చైనాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అనేక నెలల తర్వాత.. రోజువారీ వైరస్ కేసుల సంఖ్య 100 దాటింది. వైరస్ మూలాలను కనుగొనేందుకు వూహాన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం గురువారం వస్తున్న తరుణంలో ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.
చైనాలో కరోనా కేసుల సంఖ్య మంగళవారం 115కు పెరిగింది. ఇందులో 107 స్థానిక కేసులున్నట్టు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. ఈ 107లో 90 కేసులు ఉత్తర చైనాలోని హిబే రాష్ట్రంలోనే నమోదయ్యాయి.
చైనాలో మొత్తం కేసులు 87,706కు పెరగ్గా.. మొత్తం మృతుల సంఖ్య 4,634గా ఉంది.
పండుగ సీజన్...
చైనాలో త్వరలోనే పండుగ సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కేసులు పెరుగుతున్నందున సొంతూళ్లకు వెళ్లకుండా ఉండాలని అభ్యర్థిస్తున్నారు.
ఈ సందర్భంలో గ్రామాలకు కూడా మార్గదర్శకాలు జారీ చేసింది చైనా ప్రభుత్వం. క్లినిక్‌లు, ఆసుపత్రులు కరోనా కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. స్థానిక ప్రభుత్వం యంత్రాంగం అన్నింటికీ బాధ్యత వహించాలని తేల్చిచెప్పింది.
నిబంధనలు కఠినతరం..
పెరుగుతున్న కేసులను దృష్టిలో పెట్టుకుని కరోనా నిబంధనలను మరింత కఠినతరం చేసింది అమెరికా ప్రభుత్వం. అగ్రరాజ్యానికి ప్రయాణిస్తున్న వారు కొవిడ్ నెగెటివ్ రిపోర్టు తమ వెంట తీసుకెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. రెండు వారాల్లో ఈ నిబంధన అమల్లోకి వస్తుందని అధికారులు వెల్లడించారు.