చైనాలో కరోనా వైరస్ మళ్లీ కలకలం రేపుతోంది. వివిధ నగరాల్లో కేసులు అమాంతం పెరిగిపోతుండటం వల్ల ఆ దేశం వైరస్ కట్టడికి కఠిన చర్యలు చేపట్టింది. ఓ ప్రముఖ నగరాన్ని పూర్తిగా నిర్బంధించడం సహా వైరస్ ఉద్ధృతికి కారణమైన స్థానిక అధికారులకు శిక్షలు విధిస్తోంది.
చైనాలో గతేడాది కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి.. కఠిన ఆంక్షలను అమలు చేసి వైరస్ వ్యాప్తిని నిరోధించగలిగింది. అయితే.. అనూహ్యంగా ఇప్పుడు మళ్లీ కేసులు పెరుగుతుండడం ఆ దేశాన్ని ఆందోళనలోకి నెట్టేస్తోంది. చైనాలో కొత్తగా 71 మంది కరోనా సోకినట్లు తేలింది. అందులో సగం కేసులు.. ఒక్క జియాంగ్సు నగరంలోనే నమోదయ్యాయి. కొత్త కరోనా కేసుల్లో చాలా వరకు డెల్టా వేరియంట్‌కు సంబంధించినవేనని సమాచారం.
నగరం బంద్..
పర్యటక ప్రాంతమైన ఝాంగ్జియాజీ నగరంలో కరోనా హాట్‌స్పాట్ మారింది. దీంతో ఆ నగరంలో ఆదివారం కఠిన ఆంక్షలు విధించారు. ప్రజలెవరూ తమ ఇళ్లను వీడి బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. పర్యటకులైనా, స్థానికులైనా నగరాన్ని వీడి వెళ్లొద్దని నిబంధనలు విధించారు. వైరస్‌ను అడ్డుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్థానిక అధికారులకు శిక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నారు.
గతవారం నుంచి ఝాంగ్జియాజీ నగరంలో 19 కరోనా కేసులు వెలుగు చూశాయి. అందులో ముగ్గురికి ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా సోకినట్లు తేలింది. ఝాంగ్జియాజీ నగరం నుంచి మరో ఐదు రాష్ట్రాలకు కరోనా వ్యాపించిందని షాంఘైకు చెందిన ఓ వార్తా పత్రిక కథనం ప్రచురించింది.