ఓవైపు కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్(Wuhan Lab) నుంచే లీకైందా అనే విషయంపై అగ్రరాజ్యం అమెరికా దర్యాప్తు చేస్తుంటే.. మరోవైపు చైనా మాత్రం ఆ ల్యాబ్‌కు నోబెల్ బహుమతి ఇవ్వాలంటోంది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావ్ లిజియాన్ గతవారం మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. వుహాన్ ల్యాబ్‌లోనే వైరస్ పుట్టి ఉంటుందని సందేహాలు వ్యక్తం చేస్తున్న వారిపై ఆయన ధ్వజమెత్తారు. కరోనాను తొలుత వుహాన్‌లో గుర్తించినంత మాత్రాన.. అది అక్కడే ఉద్భవించిదనడం సరికాదన్నారు. వుహాన్ ల్యాబ్‌లోనే వైరస్‌ను తయారు చేశారని, పొరపాటున అది బయటకు వచ్చిందనే ఊహాజనిత కథనాలను లిజియాన్ కొట్టిపారేశారు.
" కొవిడ్-19 జన్యు క్రమాన్ని చైనా శాస్త్రవేత్తలు తొలుత గుర్తించారు. అంతమాత్రాన వైరస్‌కు మూలం వుహానే అనడం సరికాదు. చైనా శాస్త్రవేత్తలే వైరస్‌ను తయారు చేశారనడంలో అర్థం లేదు " అని లిజియాన్ అన్నారు.
అంతేగాక వుహాన్ శాస్త్రవేత్తల బృందం కరోనాపై చేస్తున్న పరిశోధనలకు వైద్యం రంగంలో నోబెల్ బహుమతి ఇవ్వాలని లిజాయాన్ అన్నారు. వారిపై నిందలు మోపొద్దన్నారు.
కొవిడ్-19పై చేసిన పరిశోధనలకు గానూ వుహాన్ ల్యాబ్‌ను చైనీస్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ అవార్డుకు నామినేట్ చేసినట్లు ఆ దేశ అధికారిక వార్తా పత్రిక గ్లోబల్ టైమ్ప్ ఆదివారం తెలిపింది.