తమ దేశంపై అమెరికా అనుసరిస్తున్న విధానాన్ని చైనా తప్పు పట్టింది. అత్యంత ప్రతికూల ధోరణిలో అమెరికా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించింది. సహకారం కంటే సంఘర్షణకే అగ్రరాజ్యం ప్రాముఖ్యతనిస్తోందని ఆరోపించింది. ఈ మేరకు అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైనా దౌత్యవేత్త లే యుచెంగ్ అభిప్రాయపడ్డారు.
ఆర్థిక పునరుజ్జీవం, కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంపై దృష్టి సారించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సహకారాన్ని బలోపేతం చేసుకోవడం అత్యంత ప్రాధాన్యమైన అంశమని లే యుచెంగ్ పేర్కొన్నారు. ఇరు దేశాలు కలిసి పని చేయటంలో ఎన్నో సవాళ్లు ఉన్నాయని అన్నారు. పోటీ, ఘర్షణలకే ఇరు దేశాలు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల సమష్టిగా ముందుకు సాగలేకపోతున్నాయని తెలిపారు.
సానుకూల సందేశం ఇస్తాం..
అమెరికా పిలుపునిచ్చిన వాతావారణ సదస్సులో చైనా సానుకూల సందేశాన్ని పంపనుందని లే యుచెంగ్ తెలిపారు. వాతావరణ మార్పులపై తాము మరింత కృషి చేయటం అంటే కొంత ఇబ్బందితో కూడుకున్నదేనని పేర్కొన్నారు.