భారత్-చైనా సరిహద్దులో ఇరుదేశాల బలగాల మోహరింపుతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బీజింగ్ స్పందించింది. సరిహద్దులో పరిస్థితి పూర్తిగా నియంత్రణలోనే ఉందని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావ్ లిజాన్ తెలిపారు. రెండు దేశాల యంత్రాంగాలు చర్చలు, సంప్రదింపుల ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటారని చెప్పారు. సరిహద్దు వివాదంపై చైనా పూర్తి స్పష్టతతో ఉందన్నారు.
రెండు దేశాల అధినేతల మధ్య కుదిరిన ఏకాభిప్రాయాన్నే తాము అనుసరిస్తున్నామని లిజాన్ అన్నారు. భారత్ సరిహద్దులో యుద్ధానికి సన్నద్ధమవ్వాలని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆ దేశ సైన్యానికి సూచించిన మరునాడే స్పందించారు లిజాన్. తమ ప్రాంత సార్వభౌమత్వాన్ని, భద్రతను కాపాడుకునేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. సరిహద్దు ప్రాంతంలో శాంతినెలకొల్పాలని, ప్రస్తుతం అక్కడి పరిస్థితులు నియంత్రణలో ఉన్నాయని చెప్పారు.