భారత్‌తో సరిహద్దు వెంబడి కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు.. నిలకడగా, నియంత్రణలో ఉన్నట్టు చైనా వెల్లడించింది. సమస్యలను చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకునేందుకు ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి జావో లిజియన్ తెలిపారు.
"పరిస్థితులను ఇరు దేశాల నేతలకు ఎప్పటికప్పుడు వివరిస్తోంది చైనా. మా సార్వభౌమత్వాన్ని, భద్రతను రక్షించుకునేందుకు, సరిహద్దు వద్ద స్థిరత్వాన్ని ఏర్పరచడానికి మేము కట్టుబడి ఉన్నాం. సరిహద్దులో ఇప్పుడు పరిస్థితులు నిలకడగా, నియంత్రణలోనే ఉన్నాయి. ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునేందుకు చైనా కృషి చేస్తోంది."
--- జావో లిజియన్, చైనా విదేశాంగశాఖ ప్రతినిధి
భారత కీర్తి ప్రతిష్టలు దెబ్బతినకుండా చైనాతో సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకుంటామని భారత రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్చేసిన ప్రకటనపై ఈ మేరకు స్పందించారు జావో లిజియన్.
ఇదీ జరిగింది...
మే 5న తూర్పు లద్దాఖ్‌లో చైనా, భారత్ సైన్యం మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరుదేశాలకు చెందిన దాదాపు 250 మంది సైనికులు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఇందులో 100 మందికిపైగా గాయపడ్డారు. అనంతరం మే 9న ఉత్తర సిక్కిం వద్ద ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. నకులా పాస్ వద్ద జరిగిన ఈ ఘర్షణలో రెండు దేశాలకు చెందిన 10 మంది సైనికులు గాయపడ్డారు. అప్పట్నుంచి చైనా-భారత్ సరిహద్దులో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
ఇదీ చూడండి-చైనా దుర్నీతి: చర్చలు జరుపుతూనే సైన్యం మోహరింపు