కరోనా వైరస్ మూలాలపై మరోసారి అధ్యయనం చేయాలనుకుంటున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రణాళికలను చైనా తోసిపుచ్చింది. డబ్ల్యూహెచ్ఓ ఆలోచనలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయని చైనా ఆరోగ్య శాఖ అధికారి జెంగ్ యాక్సిన్ వ్యాఖ్యానించారు. డబ్ల్యూహెచ్ఓ ప్రణాళికలు..సైన్స్‌కు విరుద్ధంగా సాగుతున్నట్లు అభిప్రాయపడ్డారు. తమ దేశంలో వైరస్ పుట్టుకపై డబ్ల్యూహెచ్ఓ చేయాలనుకుంటున్న పరిశోధనలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని ఆయన స్పష్టం చేశారు. పరిశోధనల సమయంలో వుహాన్ ల్యాబ్ నుంచి వైరస్ లీకైందన్న వార్తలు ఊహజనితమైనవిగా కొట్టిపారేశారు.
వూహాన్ ల్యాబ్ నుంచి వైరస్ లీకైందన్న వార్తలను తాము తోసిపుచ్చడం లేదని ఇటీవల డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. వుహాన్‌లో వైరస్ మూలాలపై పరిశోధించేందుకు అక్కడి మార్కెట్లు, ప్రయోగశాలలను దాచకుండా చైనా అధికారులు పారదర్శకత పాటించాలని స్పష్టం చేసింది. ఇప్పటికే వైరస్ పుట్టుకపై చైనాలో అధ్యయనం చేసిన డబ్ల్యూహెచ్ఓ శాస్త్రవేత్తల బృందం మరోసారి చైనా వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. వైరస్ మూలం తెలుసుకునేందుకు చైనాలోని మార్కెట్లలో వన్యజీవులపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. తొలినాటి వైరస్ వ్యాప్తిపై సమాచారాన్ని ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్‌లో చైనా దాచడం పలు అనుమానాలకు తావిస్తోందని అభిప్రాయపడ్డారు.