కరోనా వైరస్.. కొత్తగా పుట్టుకొచ్చిన ఈ మహమ్మారికి ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. చైనాలో మొదలైన ఈ వైరస్.. పలు దేశాలకు విస్తరిస్తోంది. నలుగురిని పొట్టన పెట్టుకున్న ఈ వైరస్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆ దేశంలో కొత్తగా మరో 80 మందికి ఈ వైరస్ సోకినట్లు అధికారులు ధ్రువీకరించారు. మొత్తంగా 291 మంది ఈ అంతుచిక్కని వైరస్ బారినపడ్డారని స్పష్టమైంది. మరో 900 మందికిపైగా ఇలాంటి కేసులే నమోదయ్యాయని జాతీయ వైద్య మండలి స్పష్టం చేసింది. ప్రస్తుతం వీరంతా వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు.
వేగంగా విస్తరిస్తోన్న ఈ వైరస్ ఎంతలా ప్రభావం చూపుతుందోనని వణికిపోతున్నారు చైనా వాసులు. ఇప్పటికే థాయిలాండ్, జపాన్, దక్షిణ కొరియాలోనూ ఇలాంటి కేసులు నమోదయ్యాయి. తమకూ సోకుతుందేమోనని పొరుగుదేశాలకు భయం పట్టుకుంది. అంతే ఎక్కడికక్కడ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. బ్యాంకాక్ నుంచి హాంగ్‌కాంగ్ వరకు, సియోల్ నుంచి సిడ్నీ వరకు ఎక్కడా చూసినా ప్రయాణికులను అలర్ట్ చేస్తున్నారు.
అంతటా హై అలర్ట్.. స్క్రీనింగ్ టెస్టులు
చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైరస్ కారణంగా.. ఆసియా సహా ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. దీనిని అరికట్టే దిశగా ప్రయత్నాలు ప్రారంభించాయి. ఆదిలోనే తరిమికొట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ పరీక్షను నిర్వహిస్తున్నాయి. వ్యాధి నిర్ధరణ కేంద్రాలనూ ఏర్పాటుచేశాయి.
ఎక్కువగా చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు స్క్రీనింగ్ తరహా టెస్టులు చేయాలని తొలుత నిర్ణయించాయి సింగపూర్, హాంగ్‌కాంగ్. అగ్రరాజ్యం కూడా ఇదే అమలుచేసింది. అనంతరం.. అన్ని దేశాలూ ఇదే బాటలో పయనిస్తుండగా భారత్ కూడా వైరస్ పట్ల ముందు జాగ్రత్త చర్యలు చేపడుతోంది.
భారతీయురాలికీ...
దిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో థర్మల్ స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసింది భారత సర్కారు.
చైనాలోని ఓ భారతీయ ఉపాధ్యాయురాలు ప్రీతి మహేశ్వరికీ.. తొలుత కరోనా వైరస్ సోకిందంటూ వార్తలొచ్చాయి. అయితే, అవన్నీ కల్పితమేనని.. ఆమె వేరే ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారని వైద్యులు తర్వాత నిర్ధరించారు.
థాయ్కే నష్టం...
చైనా వుహాన్ నుంచి ప్రయాణికులు ఎక్కువగా చేరుకొనే థాయిలాండ్‌లోని పలు విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ టెస్టును తప్పనిసరి చేశాయి. ఏ ఒక్కరికీ మినహాయింపు కల్పించట్లేదు అక్కడి ప్రభుత్వం. వైరస్ సంకేతాలు కనిపిస్తే.. 24 గంటలు పర్యవేక్షణలో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.