అమెరికాలో కరోనా ఉద్ధృతి రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. అగ్రరాజ్యంలో గంటలు గడిచేకొద్దీ మృత్యుఘోష పెరుగుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 3.67 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవగా.. సోమవారం ఒక్కరోజే 30,331 కొత్త కేసులు బయటపడ్డాయి. తాజాగా మరో 1,255 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 11వేలకు చేరువలో ఉంది.
ఈ నేపథ్యంలో అమెరికా భద్రతా మండలి గురువారం ఏకాంత సమావేశం కానుంది. దేశంలో కరోనా వ్యాప్తి, నియంత్రణ, వైద్య సదుపాయాలు తదితరాలపై అధికారులు చర్చించనున్నారు. యూఎస్‌లో కరోనా వైరస్ వ్యాప్తి అనంతరం ఆ దేశ భద్రతా మండలి సమావేశం కానుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ వివరాలు చైనాలో ఒక్క కేసూ నమోదు కాలేదు
కరోనా కేంద్రబిందువైన చైనాలో మంగళవారం ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదు. జనవరి నుంచి మృతుల సంఖ్య ప్రకటిస్తుండగా.. చైనాలో ఒక్క మృత్యు కేసు కూడా నమోదు కాకపోవడం ఇదే తొలిసారి. అయితే ఇవాళ అక్కడ కొత్తగా మరో 32 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు వెల్లడించారు. వీరందరూ విదేశాల నుంచి వచ్చినవారేనని ప్రకటించారు. ఫలితంగా.. చైనాలో విదేశీ కరోనా కేసుల సంఖ్య 983కు చేరింది. ప్రస్తుతం చైనాలో 1200కు పైగా కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
జపాన్‌లో అత్యయికస్థితి!
కరోనా వ్యాప్తి నేపథ్యంలో టోక్యోతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో అత్యయికస్థితి విధించనున్నారు జపాన్ ప్రధాని షింజో అబే. టోక్యో, ఒసాకా వంటి నగరాల్లో కొవిడ్-19 కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. జపాన్‌లో ఇప్పటివరకు మొత్తం 3,900కు పైగా కరోనా కేసులు నమోదవగా.. 92 మంది మృతి చెందారు.