తెలంగాణ

telangana

ETV Bharat / international

Winter Olympic Torch Bearer: టార్చ్‌బేరర్‌ వివాదంపై చైనా ఏమందంటే..? - వింటర్ ఒలింపిక్స్‌కు చైనా టార్చ్​బేరర్​ ఎంపిక

Winter Olympic Torch Bearer: బీజింగ్​లో జరుగుతోన్న వింటర్ ఒలింపిక్స్‌లో భాగంగా టార్చ్‌బేరర్‌ ఎంపికపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టార్చ్‌బేరర్‌ అంశంపై చైనా స్పందించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారి ఎంపిక నియమాలకు అనుగుణంగానే జరిగిందని స్పష్టం చేసింది.

Winter Olympics 2022
Winter Olympics 2022

By

Published : Feb 8, 2022, 8:28 AM IST

Winter Olympic Torch Bearer: బీజింగ్‌లో జరుగుతోన్న వింటర్ ఒలింపిక్స్‌లో భాగంగా టార్చ్‌బేరర్‌గా గల్వాన్‌ ఘటనలో గాయపడిన సైనికుడిని చైనా ఎంపిక చేయడంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే భారత్‌తోపాటు అగ్రరాజ్యం అమెరికా కూడా చైనా తీరును తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో టార్చ్‌బేరర్‌ అంశంపై చైనా స్పందించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారి ఎంపిక నియమాలకు అనుగుణంగానే జరిగిందని పేర్కొంది. ఈ విషయాన్ని వాస్తవిక, హేతుబద్ధమైన రూపంలోనే చూడాలని పేర్కొంటూ తన నిర్ణయాన్ని సర్దిచెప్పుకునే ప్రయత్నం చేసింది.

కర్నల్‌ క్వీ ఫాబోవాను టార్చ్‌బేరర్‌గా నియమించడం దేశాల మధ్య వారధిగా నిలిచే ఒలింపిక్స్‌కు విరుద్ధంగా ఉందా? అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్‌ స్పందించారు. 'బీజింగ్‌ వింటర్‌ ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించే టార్చ్‌ బేరర్ల ఎంపిక ప్రమాణాలకు అనుగుణంగానే జరుగుతుందని స్పష్టం చేస్తున్నాను. ఈ విషయాన్ని సంబంధిత వర్గాలు హేతుబద్ధమైన కోణంలో చూస్తాయని ఆశిస్తున్నాం' అని పేర్కొన్నారు. ఇది భారత్‌తో సున్నితమైన అంశమనే విషయాన్ని చైనా విస్మరించిందా అనే ప్రశ్నకూ ఆయన బదులిచ్చారు. దీన్ని రాజకీయ కోణంలో చూడవద్దంటూ ఝావో లిజియన్‌ అన్నారు.

Winter Olympics 2022

గల్వాన్‌ లోయలో భారత్‌ సైనికులతో జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడ్డ పీఎల్‌ఏ కర్నల్‌ క్వీ ఫాబోవాను.. వింటర్‌ ఒలింపిక్స్‌ టార్చ్‌ రిలేరన్‌ నిమిత్తం టార్చ్‌బేరర్‌గా చైనా నియమించింది. దీనికి భారత్‌ దీటుగా స్పందించింది. ఇందుకు నిరసనగా బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ ప్రారంభ, ముగింపు వేడుకలను దౌత్యపరంగా బహిష్కరించింది. ఈ అంశాన్ని రాజకీయం చేసేందుకు చైనా వింటర్‌ ఒలింపిక్స్‌ వేదికగా చేసుకుందని భారత విదేశాంగశాఖ పేర్కొంది. ఇందుకు నిరసనగా ప్రారంభ, ముగింపు వేడుకల్లో చైనాలోని భారత రాయబారి పాల్గొనరని భారత విదేశాంగ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి స్పష్టం చేశారు. మరోవైపు ఈ విశ్వక్రీడల ప్రారంభ, ముగింపు వేడుకలను దూరదర్శన్ ఛానల్‌ కూడా ప్రసారం చేయబోదని ప్రసార భారతి సీఈవో శశి శేఖర్ ఇప్పటికే పేర్కొన్నారు.

మరోవైపు చైనా తీసుకున్న వివాదాస్పద నిర్ణయాన్ని అగ్రదేశం అమెరికా కూడా తీవ్రంగా తప్పుపట్టింది. ఈ చర్య సిగ్గుచేటు అంటూ చైనా తీరును తీవ్రంగా విమర్శించింది. ఓవైపు భారత్‌పై దాడికి దిగుతూనే వీగర్లపై మారణహోమానికి పాల్పడుతోన్న చైనా.. వారి సైనికులను బీజింగ్ ఒలింపిక్స్‌కు టార్చ్‌ బేరర్‌గా ఎంచుకోవడం సిగ్గుచేటని దుయ్యబట్టింది. ఈ విషయంలో భారత్‌కు ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటుందని అమెరికా స్పష్టం చేసింది. చైనా తీసుకున్న నిర్ణయంపై ఇలా అంతర్జాతీయంగా విమర్శలు వస్తోన్న నేపథ్యంలో ఆ దేశ విదేశాంగశాఖ స్పందించింది.

ఇదీ చూడండి:వింటర్‌ ఒలింపిక్స్‌లో టార్చ్‌ బేరర్‌గా... గల్వాన్‌ లోయలో దెబ్బతిన్న కర్నల్‌

ABOUT THE AUTHOR

...view details