ధ్వని కంటే ఐదు రెట్లు వేగంగా ప్రయాణించే క్షిపణిని (China Hypersonic Missile test) పరీక్షించినట్లు వచ్చిన వార్తలను చైనా ఖండించింది. తాము హైపర్‌సోనిక్ వాహనాన్ని మాత్రమే పరీక్షించామని, అది హైపర్ సోనిక్ మిసైల్ (China Hypersonic missile) కాదని స్పష్టతనిచ్చింది. ఈ విషయంపై మాట్లాడిన చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్.. ఇది సాధారణ అంతరిక్ష వాహన పరీక్షేనని వివరించారు. అంతరిక్షం నుంచి మనుషులను తక్కువ ఖర్చుతో తిరిగి తీసుకొచ్చేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుందని తెలిపారు.
"ఆగస్టులో చేపట్టిన ప్రయోగం వాహనానిదే, మిసైల్ (China Hypersonic Missile test) కాదు. చాలా దేశాలు, సంస్థలు ఇదే తరహా పరీక్షలను చేపడుతున్నాయి. మేం చేసిన ప్రయోగం తాలూకు వాహన విడిభాగాలు.. సముద్రంలో పడిపోయాయి. అంతరిక్ష రంగానికి సంబంధించిన ఈ ప్రయోగం మానవాళికి ఉపకరిస్తుంది. అంతరిక్షాన్ని శాంతియుతంగా ఉపయోగించుకునేలా ప్రపంచ దేశాలతో కలిసి చైనా పనిచేస్తుంది."
-ఝావో లిజియాన్, చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి