తెలంగాణ

telangana

క్వాడ్‌ కూటమిని వ్యతిరేకిస్తున్నాం: చైనా

By

Published : Mar 26, 2021, 12:55 PM IST

Updated : Mar 26, 2021, 1:01 PM IST

అమెరికా ప్రోత్సాహంతో మొదలైన చతుర్భుజ కూటమి-క్వాడ్​ను వ్యతిరేకిస్తున్నట్లు చైనా ప్రకటించింది. ఏమీ లేని చోట సమస్యలు సృష్టించవద్దని అమెరికాను హెచ్చరించింది. ఇండో-పసిఫిక్‌ వ్యూహపత్రంలో చైనాను ఆర్థిక, సైనిక పోటీదారుగా పేర్కొనడాన్ని తప్పుబట్టింది.

China Senior Colonel Ren Guoqiang
చైనా సీనియర్‌ కర్నల్‌ రెన్‌గావ్‌కియాంగ్‌

భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన క్వాడ్‌ కూటమిని చైనా వ్యతిరేకించింది. ఏమీ లేని చోట సమస్యలు సృష్టించవద్దని అమెరికాను హెచ్చరించింది. అంతేకాదు.. ఈ ప్రాంతంలో శాంతిని పెంపొందించే చర్యలు చేపట్టాలని హితవు పలికింది. ఈ మేరకు చైనాకు చెందిన మినిస్ట్రీ ఆఫ్‌ నేషనల్‌ డిఫెన్స్‌లోని సీనియర్‌ కర్నల్‌ రెన్‌గావ్‌కియాంగ్‌ పేర్కొన్నారు. అమెరికా నేషనల్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌ జాక్‌ సులైవాన్‌ ఇటీవల చేసిన ప్రకటనకు బదులిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రంపంచ శాంతికి చైనా కట్టుబడి ఉంది..

"అమెరికా ప్రోత్సాహంతో మొదలైన చతుర్భుజ కూటమిని మేము వ్యతిరేకిస్తున్నాం. అది ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వాన్ని కొనసాగిస్తోంది. ఒక జట్టుగా పోరాడటాన్ని క్వాడ్‌ వ్యవస్థ నమ్ముతోంది. ఈ ప్రాంతంలోని దేశాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతోంది. మేము దీనికి వ్యతిరేకం. శాంతి, అభివృద్ధితో ఇరుపక్షాలు లాభపడాల్సిన సమయం ఇది. దీనికి వ్యతిరేకంగా ఏ ఒక్కరి అవసరాలో తీరేందుకు ఉపయోగపడాలని భావిస్తే అది విఫలం కావడం ఖాయం. ప్రపంచ శాంతి, అభివృద్ధికి చైనా కట్టుబడి ఉంది" అని రెన్‌ పేర్కొన్నారు.

అమెరికాపై మండిపాటు..

ఇక ఇటీవల అమెరికా విడుదల చేసిన ఇండో-పసిఫిక్‌ వ్యూహపత్రంలో చైనాను ఆర్థిక, సైనిక పోటీదారుగా పేర్కొనడాన్ని రెన్‌ తప్పుబట్టారు. "అమెరికా కొత్త శత్రువులను తయారు చేసుకోవడం.. ముప్పుతో చెలగాటాలాడటం తప్ప ఏం చేసింది. తన ఆధిపత్యం నిలబెట్టుకోవడానికి ఇలా చేస్తోంది. ఆ పత్రంలో ఈ విషయం స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. తన ఆధిపత్యం కొనసాగాలనే మొండితనంతో ఇలా వ్యవహరిస్తోంది. చైనా సైన్యానికి దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకొనే శక్తి ఉంది. వారు దానికి కట్టుబడి ఉన్నారు" అని రెన్‌ మండిపడ్డారు.

ఇవీ చదవండి:

Last Updated : Mar 26, 2021, 1:01 PM IST

ABOUT THE AUTHOR

...view details