భారత్‌తో సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గిస్తామంటూనే.. కయ్యానికి కాలుదువ్వుతోంది చైనా. గల్వాన్ లోయ భూభాగం నియంత్రణ రేఖకు చైనా వైపు ఉందని మరోమారు చెప్పుకొచ్చింది. గల్వాన్ లోయ సార్వభౌమధికారం తమదేనని డ్రాగన్ సైన్యం వ్యాఖ్యనించటంపై భారత్ మొట్టికాయలు వేసిన మరుసటి రోజునే ఈ మేరకు ఆ దేశ విదేశాంగ శాఖ ప్రకటించటం గమనార్హం.
భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలపై విలేకరుల సమావేశంలో గల్వాన్ ఘర్షణపై దశల వారీగా వివరిస్తూ.. ఓ ప్రకటన విడుదల చేశారు ఆ దేశ విదేశాంగ ప్రతినిధి జావో లిజియన్. ఈనెల 15న తూర్పు లద్దాఖ్‌లో జరిగిన హింసాత్మక ఘటనపై భారత్‌ను నిందించే ప్రయత్నం చేశారు.
" గల్వాన్ లోయ చైనా, భారత్ సరిహద్దులోని పశ్చిమ భూభాగంలో వాస్తవాధీన రేఖకు చైనా వైపు ఉంది. చాలా ఏళ్లుగా ఆ ప్రాంతంలో చైనా బలగాలు తమ విధులను సాధారణంగానే నిర్వర్తిస్తున్నాయి. సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులను పరిష్కరించేందుకు వీలైనంత తొందరగా కమాండర్ స్థాయిలో రెండో సమావేశం నిర్వహించాలి. దౌత్య, సైనిక మార్గాల ద్వారా ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరువర్గాలు సమాచారం అందించుకుంటున్నాయి. చైనా, భారత్ సంబంధాలకు చైనా ప్రాముఖ్యత ఇస్తుంది. ద్వైపాక్షిక సంబంధాలు దీర్ఘకాలం కొనసాగేందుకు భారత్ మాతో కలిసి పనిచేస్తుందని భావిస్తున్నాం."