తెలంగాణ

telangana

ETV Bharat / international

సైనికాధికారుల భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు

భారత్​-చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను పరిష్కరించేందుకు ఇరు దేశాల సైనికాధికారులు శనివారం భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. సమస్య పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని వెల్లడించింది.

border standoff with India
సైనికాధికారుల భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు

By

Published : Jun 5, 2020, 3:45 PM IST

భారత్​తో సరిహద్దు విషయంలో నెలకొన్న సమస్యను సరైన విధానంలో పరిష్కరించుకునేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది చైనా. ఇరు దేశాల మధ్య శనివారం ఉన్నతస్థాయి సైనికాధికారుల సమావేశం నేపథ్యంలో చైనా ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈశాన్య లద్దాఖ్​లో భారత్​-చైనా సైనికుల మధ్య ఘర్షణతో సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నెల రోజులకుపైగా కొనసాగుతున్న ఈ సమస్యకు ముగింపు పలికేందుకు తొలిసారి జరుగుతున్న సైనికాధికారుల స్థాయి భేటీలో ఇరు దేశాలు నిర్దిష్ట ప్రతిపాదనలు చేసే అవకాశాలు ఉన్నాయి.

భారత్​-చైనాల సరిహద్దుల్లో పరిస్థితులు ప్రస్తుతం సాధారణంగానే ఉన్నాయని పేర్కొన్నారు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జెంగ్​ షుయాంగ్​.

"మేం సరిహద్దుకు సంబంధించి పూర్తిస్థాయి అవగాహనతో ఉన్నాం. సైనిక, దౌత్య మార్గాల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం పంచుకుంటున్నాం. ఇటీవల నెలకొన్న సరిహద్దు సమస్యను పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నాం."

- జెంగ్​ షుయాంగ్​, చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి

భేటీలో కీలక ప్రతిపాదనలు..

భారత్​ తరఫున 14 కార్ప్స్​ కమాండర్​ లెఫ్టినెంట్​ జనరల్​ హరీందర్ సింగ్ ఈ భేటీకి హాజరవుతారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఈశాన్య లద్దాఖ్​లోని పాంగోంగ్​ త్సో, గాల్వాన్​ వాలీ, డెమ్​చోక్​ ప్రాంతాల్లో ఉద్రిక్తతలను తగ్గించాలనే ప్రతిపాదనను సింగ్​ చేయనున్నట్లు తెలుస్తోంది. పూర్వస్థితికి బలగాల స్థానాన్ని మార్చటం, భారీ వాహనాలు, ఆయుధాలను వెనక్కి తీసుకెళ్లటం వంటి ప్రతిపాదనలు ఉన్నట్లు సమాచారం.

ఇప్పటి వరకు స్థానిక కమాండర్లు, మేజర్​ జనరల్​ ర్యాంకు అధికారుల మధ్య సుమారు 10 సార్లు చర్చలు జరిగాయి. కానీ, ఎలాంటి సానుకూల ఫలితాలు రాలేదు.

ABOUT THE AUTHOR

...view details