అంతర్జాతీయంగా తన ప్రతిష్ఠను కాపాడుకునేందుకు చైనా పడరాని పాట్లు పడుతోంది. కరోనాకు వ్యాక్సిన్లను అభివృద్ధి చేసిన చైనా.. వాటి ప్రయోగాల కోసం ఇతర దేశాలపై ఒత్తిడి తెస్తోంది. టీకా తుది దశ ట్రయల్స్‌ను 12 దేశాల్లో బలవంతంగా నిర్వహిస్తోంది. అంతర్జాతీయ వ్యాక్సిన్ పోటీలో ముందుండి తన చరిష్మాను కాపాడుకునేందుకు ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
పెరూ, అర్జెంటీనా, బ్రెజిల్, బహ్రెయిన్, యూఏఈ, ఈజిప్ట్, టర్కీ, మొరాకో, సౌదీ అరేబియా, బంగ్లాదేశ్, ఇండోనేసియా, రష్యా దేశాల్లో వేలాది మందిపై వ్యాక్సిన్‌ను ప్రయోగించినట్లు హాంకాంగ్‌కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది. ప్రభుత్వంతో పాటు వ్యాక్సిన్ సంస్థల ప్రకటనలు, మీడియా కథనాల ఆధారంగా ఈ వివరాలు వెల్లడించింది.
వ్యాక్సిన్ ముందుగానే లభిస్తుందన్న ఆశతోనే కొన్ని దేశాలు చైనా పరీక్షలకు అనుమతిస్తున్నట్లు పత్రిక పేర్కొంది. మెక్సికో, బంగ్లాదేశ్, పాకిస్థాన్ దేశాలను ఈ సందర్భంగా ప్రస్తావించింది. ముందస్తుగా వ్యాక్సిన్‌ను పొందడానికే ట్రయల్స్‌కు అనుమతులు ఇచ్చినట్లు ఆయా దేశాల అధికారులు చేసిన వ్యాఖ్యలను ఉటంకించింది.