పెంపుడు జంతువుల్లో ఒకటైన పిల్లులపైనా కరోనా ప్రభావం చూపిస్తోంది. ఇప్పటివరకు ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో వీటిల్లో కొవిడ్ లక్షణాలు కనిపిస్తున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. చైనా వుహాన్‌లో కరోనాను గుర్తించిన తర్వాత నుంచి ఆ ప్రాంతంలోని పిల్లులపై సర్వే చేసింది హౌజాంగ్ వ్యవసాయ విద్యాలయం.
యాంటీబాడీలతో తప్పిన ముప్పు..
జనవరి నుంచి మార్చి మధ్యలో దాదాపు 102 పిల్లులపై పరిశోధన చేశారు. వాటి రక్తం సహా నోటి, మూత్ర నమూనాలను తీసుకున్నారు. ఈ సర్వేకు సంబంధించిన నివేదికను ప్రముఖ జర్నల్ ఎమర్జింగ్ మైక్రోబ్స్ అండ్ ఇన్ఫెక్షన్స్లో ప్రచురించారు. వీటిల్లో 15 పిల్లుల్లో కొవిడ్ యాంటీబాడీలు ఉన్నట్లు పరిశీలకులు గుర్తించారు. వాటిలో ఉన్న ప్రత్యేకమైన ప్రోటీన్ కరోనాను సమర్థంగా ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు.
పిల్లుల్లో కొవిడ్ ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఎక్కువగా ఉన్నప్పటికీ.. సాధారణంగానే ఉత్పత్తయిన యాంటీబాడీలు మహమ్మారితో పోరాడుతున్నట్లు ఆ నివేదికలో తెలిపారు. ఏ పిల్లీ కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ కాలేదని.. కొన్ని లక్షణాలు ఉన్నప్పటికీ అవి చనిపోవట్లేదని స్పష్టం చేశారు.