చైనాలో దేశీయ కేసులు సున్నా... కానీ కరోనాపై చైనా చేపట్టిన చర్యలు ఫలితాల్నిస్తున్నాయి. ఆదివారం దేశీయంగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. కానీ విదేశాల నుంచి వచ్చిన మరో 39మంది వైరస్ బారినపడ్డారు.
దేశీయంగా గెలిచింది కానీ...
గతవారం వరుసగా మూడు రోజుల పాటు ఒక్క దేశీయ కేసు కూడా నమోదు కాలేదు. కానీ శనివారం ఓ చైనావాసికి వైరస్ సోకింది. కరోనా లక్షణాలున్న ఓ విదేశీయుడిని అతడు కలిసినట్టు తెలుస్తోంది. ఆ తరువాత ఆదివారం మళ్లీ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
కరోనాను దేశీయంగా అరికట్టగలిగినా.. విదేశాల నుంచి వచ్చే వైరస్ బాధితులను కట్టడి చేయలేకపోతోంది చైనా. ఈ సమస్యను పరిష్కరించడానికి చర్యలు ముమ్మరం చేసింది. రాజధాని బీజింగ్‌కు రావాల్సిన అన్ని అంతర్జాతీయ విమానాలను 12 ఇతర నగరాలకు మళ్లించాలని నిర్ణయించింది. ఈ విమానాశ్రయాల్లో ప్రయాణికులను నిర్బంధంలోకి తీసుకుని, క్షుణ్నంగా తనిఖీ చేయాలని ఆదేశించింది. కరోనా లేదని నిర్ధరణ అయ్యాకే బీజింగ్‌కు వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేసింది.
ఇప్పటివరకు చైనాలో 81, 093 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం మృతిచెందిన 9 మందితో కలిపి.. మొత్తం 3,270 కొవిడ్-19కు బలయ్యారు. మరో 5,120 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 72,703 మంది కరోనాను జయించి ఇళ్లకు చేరారు.
ఇదీ చదవండి:సెనేట్‌లో గట్టెక్కని ట్రంప్ ట్రిలియన్ డాలర్ల 'ప్యాకేజీ'