వేల కేసుల నుంచి ఒక్కటికి చైనా ప్రపంచ దేశాలను చిన్నాభిన్నం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై చైనా దాదాపు విజయం సాధించింది. సోమవారం కొత్తగా ఒక్క కేసు మాత్రమే నమోదైనట్లు తెలిపింది. అయితే విదేశాల నుంచి వచ్చిన వారిలో 20మంది కరోనా పాజిటివ్‌గా తేలడం పట్ల కొంత ఆందోళనతో ఉంది చైనా. వైరస్ కేంద్రబిందువైన వుహాన్‌లో మినహా చైనాలో మరెక్కడా కొత్తగా కరోనా కేసు నమోదు కాలేదని అధికారులు తెలిపారు.
చైనాకు సగటున రోజుకు 20వేల మంది పర్యటకులు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో వైరస్ కట్టడికి ఆంక్షలు కఠినతరం చేసింది ఆ దేశం. తమ దేశానికి వచ్చే విదేశీయులను 14రోజుల నిర్బంధంలో ఉంచాలని నిర్ణయించింది. ఇది సోమవారమే అమల్లోకి వచ్చింది.
కరోనా కారణంగా చైనాలో ఇప్పటివరకు 3226 మంది మరణించారు. 80,881 మంది వైరస్ బారిన పడ్డారు. 68,679మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
అమెరికాలో కర్ఫ్యూ
కరోనా వాప్తి ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో అమెరికా మరింత అప్రమత్తమైంది. ఐరోపా తరహాలో పాఠశాలలు, థియేటర్లు, రెస్టారెంట్లు, బార్లు మూసివేసింది. న్యూ జెర్సీ, శాన్ ఫ్రాన్సిస్కోలో కర్ఫ్యూ విధించింది. 10 మంది కంటే ఎక్కువ మంది గుంపుగా ఉండకూడదని ప్రజలకు సూచించారు అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వేసవి కాలం పూర్తయ్యే వరకు ఇదే పరిస్థితి ఉండవచ్చని హెచ్చరించారు. కరోనా మహమ్మారి అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందని, ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశాలు లేకపోలేదని స్పష్టం చేశారు.
శ్వేతసౌధంలో స్క్రీనింగ్..
కరోనా నుంచి ట్రంప్‌ను రక్షించుకునేందుకు శ్వేతసౌధం అధికారులు చర్యలు చేపట్టారు. కార్యాలయానికి వచ్చే సిబ్బంది, మీడియా ప్రతినిధులకు తప్పనిసరిగా స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. కచ్చితంగా చేతులు శుభ్రం చేసుకునే శ్వేతసౌధంలోకి ప్రవేశించాలని సూచిస్తున్నారు.
ఐరాస సమావేశం వాయిదా...
సిబ్బందిలో ఒకరికి కరోనా సోకిన కారణంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశాలను రద్దు చేశారు.