కరోనాకు కేంద్ర బిందువైన వుహాన్ నగరంలో వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. చైనాలో ఆదివారం మొత్తం 25 కేసులు నమోదు కాగా.. అందులో 14 కేసులు వుహాన్లోనే ఉన్నట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. వుహాన్లో నమోదైన ఈ కేసుల్లో ఎందులోనూ లక్షణాలు కనిపించలేదని అధికారులు తెలిపారు.
నగరంలోని 11 మిలియన్ల మందికి పెద్దఎత్తున కరోనా పరీక్షలు చేపడుతున్న నేపథ్యంలో కొత్తగా కేసులు బయటపడుతున్నాయి. వూహాన్లో లక్షణాలు లేకుండానే వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య 337కు చేరింది. అలాంటి కేసులు నమోదవుతున్న నగరాల్లో దేశంలోనే వుహాన్ అగ్ర స్థానంలో ఉంది.
ఆదివారం (మే 17న) పాజిటివ్ కేసులు నమోదైనప్పటికీ.. ఎలాంటి మరణాలు సంభవించలేదని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. ఆదివారం నమోదైన 25 కేసుల్లో 18 మందికి లక్షణాలు కనిపించలేదని తెలిపింది. ఇటీవల కఠిన ఆంక్షలు విధించిన జిలిన్ రాష్ట్రంలోని జిలిన్ నగరంలో 2, షాంఘై పట్టణంలో ఒక కేసు నమోదైనట్లు తెలిపింది.
ఆదివారం వరకు దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 82,954కు చేరగా అందులో 78, 238 మంది కోలుకున్నారు. ఇంకా 82 మంది చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం చైనాలో మొత్తం మరణాల సంఖ్య 4,634కు చేరింది.