కరోనా వైరస్ చైనాను వీడట్లేదు. చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ (ఎన్‌హెచ్‌సీ) ప్రకారం.. దేశవ్యాప్తంగా శుక్రవారం18 కొత్త కేసులు నమోదయ్యాయి. రెండు నెలలుగా చైనాలో అత్యంత సురక్షిత ప్రాంతంగా నిలిచిన రాజధాని బీజింగ్‌లో 6 కేసులు వెలుగులోకి వచ్చాయి.
బీజింగ్‌లో జింఫడి మార్కెట్లో మాంసం కొట్టే చెక్కపై కరోనా వైరస్‌ను గుర్తించారు అధికారులు. దీంతో ఆ ప్రాంతంలో తొమ్మిది మందిని నిర్బంధంలో ఉంచారు. జింఫడి మార్కెట్, జింగ్షెన్ సీఫుడ్ మార్కెట్లతో పాటు మరో నాలుగు ప్రధాన మార్కెట్లు కూడా మూతబడ్డాయి. వీటి ద్వారా కరోనా కేసులు పెరిగే అవకాశముందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతంలో కరోనా మరోసారి విజృంభించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో బీజింగ్‌లో పాఠశాలలు తెరవాలనుకున్న ఆలోచనను మానుకుంది అక్కడి ప్రభుత్వం.