పన్నెండో విడత సైనిక చర్చలపై భారత్-చైనా సంయుక్త ప్రకటన విడుదల చేసిన రోజే.. ఓ అనుమానిత చైనా ట్విట్టర్ హ్యాండిల్ నుంచి గల్వాన్ ఘర్షణల వీడియో బయటకు వచ్చింది. ఈ దృశ్యాలు గతేడాది భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించినవే అని అందులో పేర్కొన్నారు. ఘర్షణలో మరణించిన పీఎల్ఏ సైనికుల కుటుంబ సభ్యుల ఇంటర్వ్యూ తాలూకు దృశ్యాలు సైతం అందులో ఉన్నాయి.
45 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో చైనా సైనికులు భారత జవాన్లపై రాళ్లు రువ్వడం కనిపిస్తోంది. గల్వాన్ నదిని దాటేందుకు పీఎల్ఏ సైన్యం పడిన తంటాలు అందులో చూడొచ్చు. సైన్యం సహాయక చర్యల దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి.
గతంలో గల్వాన్ ఘర్షణకు సంబంధించి చైనా ఓ బూటకపు వీడియోను విడుదల చేసింది. భారత సైన్యమే దాడికి పాల్పడిందని చెప్పుకొచ్చింది. అయితే, ఆ వాదనను భారత అధికారులు కొట్టిపారేశారు.
గల్వాన్ ఘర్షణ
భారత్-చైనా సైన్యాల మధ్య జూన్ 15న భీకర ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో 20 మంది భారత సైనికులు అమరులు కాగా.. అంతకన్నా రెట్టింపు సంఖ్యలో చైనా సైనికులు చనిపోయారు. అయితే డ్రాగన్ మాత్రం ప్రాణనష్టంపై నీళ్లు నములుతోంది. తొలుత ఎవరూ చనిపోలేదని బుకాయించి.. ఆ తర్వాత నలుగురు మాత్రమే మరణించారని ప్రకటించింది. అప్పటి నుంచి సరిహద్దులో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. పలు దఫాలుగా చర్చించిన తర్వాత ఫిబ్రవరిలో సైనిక ఉపసంహరణకు ఇరుదేశాలు అంగీకారానికి వచ్చాయి. ఫలితంగా పాంగాంగ్ ఉత్తర, దక్షిణ తీరాల్లో మోహరించిన సైన్యాన్ని ఇరుదేశాలు వెనక్కి పిలిచాయి.
12వ విడతలో మరో ముందడుగు
కాగా, మిగిలిన ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణపై భారత్-చైనా సైన్యాలు జులై 31న 12వ విడత చర్చలు జరిపాయి. ఇందులో భాగంగా తూర్పు లద్దాఖ్‌లోని 17ఏ పెట్రోలింగ్ పాయింట్ వద్ద ఉన్న సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించుకున్నట్లు తాజాగా అధికారులు తెలిపారు. గోగ్రాగా పిలిచే ఈ పాయింట్.. ప్రతిష్టంభన నెలకొన్న ప్రాంతాల్లో కీలకమైనది.
మరోవైపు.. పెట్రోలింగ్ పాయింట్-15(హాట్ స్ప్రింగ్), దెస్పాంగ్ ప్రాంతాల్లోని బలగాలను వెనక్కి తరలించేందుకు ఇరుపక్షాలు చర్చలను కొనసాగించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి:వుహాన్ ల్యాబ్ నుంచే కరోనా- తేల్చిన మరో నివేదిక!