తెలంగాణ

telangana

ETV Bharat / international

'జగ్‌ ఆనంద్‌' సిబ్బంది మార్పునకు చైనా ససేమిరా

చైనాతో దౌత్య సంబంధాలు దెబ్బతినడం వల్ల.. ఆ దేశ ఓడరేవులో నిలిచిపోయిన భారతీయ రవాణా నౌక విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఆస్ట్రేలియా నుంచి తీసుకెళ్లిన సరకు దిగుమతికి జిన్​పింగ్​ సర్కారు అనుమతించకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తింది. కొవిడ్​ నిబంధనల పేరిట అక్కడ నిలిపివేసిన నౌకలలో.. గత జూన్​ నుంచి 'జగ్​ ఆనంద్​' జింగ్​తాంగ్​లోనే చిక్కుకుంది.

China reiterates its reluctance for change of crew of stranded Indian ship
'జగ్‌ ఆనంద్‌' సిబ్బంది మార్పునకు చైనా ససేమిరా

By

Published : Dec 24, 2020, 9:31 AM IST

చైనా ఓడ రేవులో నిలిచిపోయిన భారతీయ రవాణా నౌక విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఆస్ట్రేలియా నుంచి బొగ్గును తీసుకుని చైనాకు పయనమైన 'జగ్‌ ఆనంద్‌' నౌక.. గత జూన్‌లో జింగ్‌తాంగ్‌ రేవు వద్ద నిలిచింది. కొవిడ్‌ నిబంధనల కారణంగా మరిన్ని నౌకలను అక్కడ నిలిపివేయగా, ఆ క్యూలో జగ్‌ ఆనంద్‌ చిక్కుకుంది. అయితే... తమను బయటకు పంపాలని, సిబ్బందిని మార్చాలని అందులోని 23 మంది భారతీయులు చైనా అధికారులను అభ్యర్థిస్తున్నారు.

జాతీయ భారత నావికుల సంఘం, అంతర్జాతీయ రవాణా కార్మిక సమాఖ్య, అంతర్జాతీయ సముద్ర సంస్థలు కూడా వారి విషయమై కొన్ని వారాలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చైనాలోని భారత రాయబార కార్యాలయ అధికారులు జగ్‌ ఆనంద్‌ సహా.. కాఫీడియన్‌ రేవులో నిలిచిన అనస్తాసియా నౌకలోని మరో 16 మంది భారతీయ సిబ్బందినీ బయటకు పంపేందుకు అనుమతించాలని స్థానిక అధికారులతో సంప్రదింపులు నిర్వహిస్తున్నారు. చైనా ఉన్నతాధికారులు మాత్రం ఇందుకు ససేమిరా అంటున్నారు.

శాస్త్రీయ కారణాల వల్లే..

తాజాగా డ్రాగన్‌ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్‌ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ... 'మహమ్మారి నియంత్రణకు రేవుల వద్ద ఆంక్షలను కచ్చితంగా అమలు చేస్తున్నాం. నావికా సిబ్బంది కోసం క్వారంటైన్‌ కేంద్రాలు నడుపుతున్నాం. ఈ చర్యలన్నీ శాస్త్రీయంగానే చేపడుతున్నాం. మా స్థానిక సిబ్బంది ఎప్పటికప్పుడు భారత్‌ నుంచి వస్తున్న అభ్యర్థనలకు బదులు ఇస్తున్నారు.' అని పేర్కొన్నారు. జగ్‌ ఆనంద్‌ ప్రయాణాన్ని చైనా ఎప్పుడూ నియంత్రించలేదనీ, వాణిజ్య ప్రయోజనాల దృష్ట్యానే ఆ నౌక కోసం ఫ్రైట్‌ ఫార్వార్డర్‌ ప్రణాళికను మార్చడం లేదని చైనా విదేశాంగశాఖ అధికారి వాంగ్‌ వెన్‌బిన్‌ ఇంతకుముందు చెప్పుకొచ్చారు.

ఆస్ట్రేలియా-చైనా విభేదాల వల్లే...

ఆస్ట్రేలియా నుంచి జగ్‌ ఆనంద్‌ సహా మొత్తం 22 నౌకలు బొగ్గును తీసుకుని చైనాకు బయల్దేరాయి. ఈ ఓడల్లో మొత్తం 400కు పైగా మంది సిబ్బంది ఉన్నారు. వాణిజ్యపరమైన విభేదాల నేపథ్యంలో ఉభయ దేశాల నడుమ ఘర్షణ వాతావరణం నెలకొంది. తమ బొగ్గు, బార్లీ, రాగి, చక్కెర, కలప, వైన్‌, సముద్ర ఉత్పత్తుల రవాణాను చైనా అడ్డుకుంటోందని ఆస్ట్రేలియా ఆరోపిస్తోంది.

ఇదీ చదవండి:మరో వేషంలో మహమ్మారి.. మరింత ప్రమాదకారి.!

ABOUT THE AUTHOR

...view details