తెలంగాణ

telangana

ETV Bharat / international

'అందరినీ అన్నిసార్లు ఫూల్ చేయడం కుదరదు' - 24 అసంబద్ద ఆరోపణలు

కరోనా కట్టడిలో విఫలమైనట్లు అమెరికా చేస్తున్న ఆరోపణలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది చైనా. ఈ మేరకు అగ్రరాజ్య వ్యాఖ్యలను ఖండిస్తూ సుదీర్ఘ ప్రకటన వెలువరించింది. '24 అసంబద్ధ ఆరోపణల' పేరిట 30 పేజీల కథనాన్ని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెబ్​సైట్​లో ఉంచింది.

china us
చైనా అమెరికా

By

Published : May 12, 2020, 6:01 AM IST

కరోనా వైరస్‌ కట్టడికి సంబంధించి అమెరికా చేస్తోన్న ఆరోపణలపై చైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సుదీర్ఘ ఖండన వెలువరించింది. 24 'అసంబద్ధ ఆరోపణలు' అంటూ 30 పేజీల కథనాన్ని.. తమ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో ఉంచింది. అలాగే ఆ శాఖ అధికారిక ప్రతినిధి హువా చునియింగ్ అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహాం లింకన్‌ చెప్పిన సూక్తిని మీడియా సమావేశంలో ప్రస్తావించి ఘాటుగా బదులిచ్చారు.

"లింకన్‌ చెప్పినట్లు.. కొంతమందిని ఎప్పుడూ ఫూల్ చేయొచ్చు. కొంత సమయంలో అందరిని ఫూల్ చేయొచ్చు. కానీ అందరిని అన్ని సార్లు ఫూల్ చేయడం కుదరదు" అని చునియింగ్ పేర్కొన్నారు.

ఇదేం పిల్లల ఆట కాదు

"సెక్రటరీ పాంపియో, స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధులు ఇంటర్వ్యూలు ఇవ్వడంలో బిజీగా ఉన్నారు. కరోనా వైరస్‌కు సంబంధించి చైనా సరైన సమాచారం ఇవ్వలేదని, జవాబుదారీగా ఉండటానికి దర్యాప్తు చేయాలని వారు నిరాధారమైన ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. మేం జరిగింది చెప్తూనే ఉన్నాం. కానీ యూఎస్‌ మాత్రం తరచుగా అబద్ధాలు చెప్తూనే ఉంది. వాస్తవాల ద్వారా ప్రపంచానికి సహకరించడానికి మేం ప్రయత్నిస్తున్నాం. వైరస్‌ మీద సమాచారం ఇచ్చే విషయంలో చైనా వేగంగా స్పందించలేదని వారు ఆరోపిస్తున్నారు. కొవిడ్ 19 బారిన పడిన మొదటి దేశం చైనా. ప్రతి విషయాన్ని ఒక క్రమం ప్రకారం వెల్లడించాం. అలాగే వెల్లడించిన సంఖ్య మీద కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అబద్ధాలు చెప్పడానికి ఇదేం పిల్లల ఆట కాదు" అని అమెరికా తీరుపై మండిపడ్డారు చునియింగ్.

"జవాబుదారీ తనం, పరిహారం గురించి వారు మాట్లాడుతున్నారు. కొవిడ్ 19పై స్పందించిన తీరుపై చైనీయులు తమ దేశానికి అత్యధిక రేటింగ్ ఇచ్చినట్లు తాజాగా సింగపూర్‌ నుంచి వచ్చిన సర్వే వెల్లడించింది" అని ఆయన తెలిపారు. మరోవైపు అమెరికా నేతలు, ముఖ్యంగా పాంపియో చేసే ఆరోపణలను తిప్పికొట్టడానికే చైనా విదేశాంగ శాఖ ఎక్కువ సమయం మీడియా సమావేశాలకు వెచ్చిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details