కొవిడ్ ఆంక్షల్లో భాగంగా గత రెండేళ్లుగా వీసాల జారీపై బీజింగ్ విధించిన నిషేధంతో భారత్‌లోని ఇళ్ల వద్దే ఉండిపోయిన దాదాపు 23 వేలమంది విద్యార్థులను త్వరలో మళ్లీ వెనక్కు రప్పిస్తామని భారత ప్రభుత్వానికి చైనా హామీ ఇచ్చింది. భారత విద్యార్థులపై తమకెలాంటి వివక్ష లేదని, ఇది రాజకీయ అంశం కానేకాదని స్పష్టం చేసింది. చైనాలోని వివిధ కళాశాలల్లో భారత్‌కు చెందిన పలువురు విద్యార్థులు ఎక్కువగా వైద్యవిద్య అభ్యసిస్తున్నారు.
త్వరలో మళ్లీ చైనాకు భారత విద్యార్థులు - indian students news
బీజింగ్ విధించిన నిషేధంతో రెండేళ్లుగా భారత్‌లోని ఇళ్ల వద్దే ఉండిపోయిన దాదాపు 23 వేలమంది భారత విద్యార్థులు త్వరలో చైనాకు వెళ్లనున్నారు. ఈ మేరకు భారత ప్రభుత్వానికి చైనా హామీ ఇచ్చింది.
చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ భారత రాయబార కార్యాలయానికి హామీ ఇస్తూ.. విదేశీ విద్యార్థుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు భారత ఎంబసీ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఇటీవల బీజింగ్‌లో పర్యటించినపుడు కూడా చైనా నుంచి ఇదేవిధమైన హామీ పొందారు. పాక్ విద్యార్థులు 28 వేలకు పైగా చైనాలో చదువుతున్నారు. ఇతర దేశాలకు కూడా ఇలాంటి హామీలే ఇచ్చిన చైనా.. విద్యార్థులు మళ్లీ వెనక్కు ఎప్పుడు రావాలన్నది మాత్రం స్పష్టత ఇవ్వలేదు.