ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్న హంకాంగ్ జాతీయ భద్రతా చట్టానికి చైనా పార్లమెంట్ ఆమోదం పలికింది. తమ హక్కులను కాలరాస్తున్నారంటూ హాంకాంగ్ వాసులు ఉద్యమం చేస్తున్నప్పటికీ చైనా లెక్కచేయలేదు.
ఈ చట్టానికి తాజాగా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ ఆమోదముద్ర వేసినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది. స్థాయి సంఘంలోని 162 మంది సభ్యులు 15 నిమిషాల్లోనే దీనికి ఆమోదం పలికారు.
అయితే ఇంతకుముందు బిల్లులో రూపొందించిన 10 ఏళ్ల జైలు అనే నిబంధనను జీవిత కాలానికి మార్చిందని సమాచారం.
హాంకాంగ్‌ను 23 ఏళ్ల క్రితం బ్రిటిష్ పాలకులు చైనాకు అప్పగించిన జులై 1నే ఈ చట్టం అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.
ఈ వివాదాస్పద చట్టాన్ని నిలిపివేయాలని ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, ఐరోపా సమాఖ్య పార్లమెంట్, జీ-7 దేశాల కూటమి చైనాపై ఒత్తిడి తెచ్చాయి. అయినప్పటికీ వినిపించుకోలేదు చైనా.
'రక్షణ ఉత్పత్తులను ఆపేస్తాం'
హాంకాంగ్‌కు రక్షణ ఎగుమతులు నిలిపివేయనున్నట్లు అమెరికా ప్రకటించింది. హాంకాంగ్‌లో రాజకీయ, పౌర హక్కులను స్వస్తి పలుకుతూ నూతన జాతీయ భద్రతా చట్టాన్ని చైనా ఆమోదించి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తెలిపారు. త్వరలో నూతన విధివిధానాలు అందుబాటులోకి రానున్నాయని ఆయన చెప్పారు.
1997 నుంచి అనుసరిస్తున్న నియమాల ప్రకారం అమెరికా నుంచి రక్షణరంగ సామగ్రిని.. ఎలాంటి లైసైన్సు లేకుండానే దిగుమతి చేసుకునే సౌలభ్యం హాంకాంగ్‌కు ఉంది. ఇప్పటివరకు ఒకే దేశం, రెండు వ్యవస్థల విధానం అమల్లో ఉన్న హాంకాంగ్‌లో..ఇకపై ఒకే దేశం, ఒకే వ్యవస్థను అమలుచేయాలని చైనా భావిస్తోందని పాంపియో తెలిపారు. రక్షణరంగ ఎగుమతులను కొనసాగించి తమ దేశ భద్రతను ప్రమాదంలో పడేయలేమని పాంపియో స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:'మీ దగ్గర సమస్య పెట్టుకొని మమ్మల్ని నిందిస్తారా?'