చైనాను వణికిస్తోన్న కరోనా వైరస్‌కు వాక్సిన్ కనుగొనే సంస్థలకు భారీ ఆఫర్ ప్రకటించింది ఆ దేశ కేంద్ర బ్యాంకు.. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా(పీబీఓసీ). వైరస్‌కు విరుగుడు కనుగొనే పనిలో నిమగ్నమైన సంస్థలకు సుమారు 300 బిలియన్ యువాన్(43 బిలియన్ల అమెరికా డాలర్లు) సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. తొలి విడతలో భాగంగా ఆర్థిక సంస్థలకు సోమవారం నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపింది.
ఇందు కోసం 10 రాష్ట్రాలు, నగరాల్లోని 9 జాతీయ బ్యాంకులతో పాటు స్థానిక బ్యాంకులకు రుణాలు అందించేందుకు అర్హత ఉన్నట్లు పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా(పీబీవోసీ) డిప్యూటీ గవర్నర్ లియూ గోకియంగ్ వెల్లడించారు. ఈ విషయాన్ని అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు. రుణాల మంజూరు వివరాలను కేంద్రం పరిశీలిస్తుందని.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గోకియంగ్ స్పష్టం చేశారు.
చైనా ఎంపిక చేసిన 10 రాష్ట్ర బ్యాంకుల పరిధిలో కరోనా వైరస్‌కు మూలమైన హుబే ప్రావిన్స్ సహా ఝేజియాంగ్, గువాంగ్డాంగ్ నగరాలు ఉన్నాయి. నిధులు సమకూర్చటం వల్ల సంస్థల లక్ష్యాలను త్వరితగతంగా చేరుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు లియూ.