దుందుడుకు వైఖరితో నిత్యం వార్తలో నిలిచే ఉంటుంది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ). చైనా సైన్యం ఆగడాలపై ప్రపంచ దేశాలు ఎప్పటికప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంటాయి. అయినప్పటికీ బీజింగ్ తన ప్రవర్తనను మార్చుకోవడం లేదు. సైన్యాన్ని కట్టడి చేయాల్సింది పోయి.. ప్రపంచ దేశాలపై దండయాత్రకు పంపించేందుకు చట్టపరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడుతోంది. ఈ క్రమంలోనే 'నేషనల్ డిఫెన్స్' చట్టాన్ని తీసుకొస్తోంది.
ప్రజాభిప్రాయ సేకరణ
పీఎల్ఏను దండయాత్రలకు అనుగుణంగా తీర్చిదిద్దే విషయంపై ప్రజల అభిప్రాయాలను సేకరిస్తోంది చైనా అత్యున్నత నిర్ణాయక కమిటీ ఎన్పీసీ( నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్). కమ్యూనిస్ట్ చైనాలో ఇలా ప్రజాభిప్రాయ సేకరణ చేయడం చాలా అరుదు.
భారత్ కోణంలో నుంచి చూస్తే ఇది ప్రమాదకరమైన విషయమే. ఇలాంటి చట్టాన్ని తీసుకొస్తే... పాక్ ఆక్రమిత కశ్మీర్, శ్రీలంక, మయన్మార్, మాల్దీవులు, హిందూ మహా సముద్రంలోని ఎక్కడైనా చైనా సైనిక చర్యలు చేపట్టవచ్చు. ఆయా దేశాల అనుమతులు కూడా తీసుకోకుండా ఈ చర్యలు చేపట్టే అవకాశముంది.
ఇదీ చూడండి:-నేపాల్నూ వదలని చైనా- సరిహద్దులో దురాక్రమణలు
ప్రపంచశక్తిగా ఎదిగేందుకు చైనా చేపడుతున్న దుశ్చర్యల్లో ఈ ప్రతిపాదిత 'నేషనల్ డిఫెన్స్' చట్టం ఒకటి. దీనితో తన ఆర్థిక, సైనిక శక్తిని ప్రదర్శించుకోవాలని చైనా చూస్తోంది. ఈ చట్టంతో ప్రపంచంలో ఎక్కడైనా, ఏ పరిస్థితుల్లోనైనా జోక్యం చేసుకునేందుకు చైనా సైన్యానికి న్యాయపరంగా ఎలాంటి అడ్డంకులు ఉండవు.
తమ ప్రయోజనాలను రక్షించుకునేందుకు ఇవి అవసరమని చైనా వాదించినా.. చివరకు ఈ పరిణామాలు ప్రాంతీయంగా అనిశ్చితులకు దారి తీస్తాయి.