చైనా ప్రయోగించిన చాంగే-5 వ్యోమనౌక చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా మట్టి, రాళ్లను సేకరించినట్లు ప్రకటించింది ఆ దేశ జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం. నమూనాలను వ్యోమనౌకలో భద్రపరిచి.. భూమికి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపింది.
" చంద్రుడిపై నమూనాల సేకరణ విజయవంతంగా పూర్తయింది. చంద్రుడిపై మట్టి, రాళ్లను భూమికి తీసుకురావడానికి.. వాటిని క్యాప్సూల్‌కు బదిలీ చేసేందుకు వ్యోమనౌక పైదశను తిరిగి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. "
- చైనా జాతీయ అంతరిక్ష కేంద్రం.
చాంగే-5 గత మంగళవారం చంద్రుడిపై విజయవంతంగా దిగింది. రెండు రోజుల పాటు తవ్వకాలు చేపట్టి నమూనాలను సేకరించింది. 1976 తర్వాత చంద్రుడి నమూనాలను భూమి పైకి తెచ్చేందుకు చేపట్టిన తొలి ప్రయోగం ఇదే కావటం గమనార్హం.
చైనా చేపట్టిన అంతరిక్ష ప్రయోగాలన్నింటిలో ఇది అత్యంత సంక్లిష్టమైంది. రెండు రోజులుగా చంద్రుడి ఉపరితలంపై డ్రిల్లింగ్ చేస్తుంది ఛాంగే-5. 2 కిలోగ్రాముల(4.4పౌండ్లు) రాళ్లు, వ్యర్థాలను సేకరిస్తుంది. తిరిగి కక్షలోకి చేరి.. అప్పటికే అక్కడ ఉండే ఓ క్యాప్సూల్‌లో ఈ పదార్థాలను పెడుతుంది. ఈ క్యాప్సూల్.. ఈ నెల మధ్య వారంలో తిరిగి భూమికి చేరుకుంటుంది.
ఇదీ చూడండి: చైనా 'చాంగె-5' మిషన్ ప్రయోగం విజయవంతం