తూర్పు లద్ధాఖ్లోని గల్వాన్ లోయ.. దశాబ్దాలుగా భారత్ అధీనంలోనే ఉంది. ఇక్కడ చైనాతో ఎలాంటి సరిహద్దు వివాదం లేదని ప్రకటిస్తూ వస్తోంది మన దేశం. చైనా కూడా గల్వాన్ లోయపై ఎప్పుడూ మాట్లాడలేదు. ఆశ్చర్యకరంగా ఇప్పుడు గల్వాన్‌పై సార్వభౌమాధికారం మాదేనంటూ కొత్త వివాదానికి తెరతీసింది పొరుగు దేశం.
కొన్ని రోజులుగా వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు దేశాలు భారీగా బలగాలను మోహరించాయి. విమానాలు, ఆర్టిలరీ గన్స్‌తోపాటు భారీ వాహనాలను తరలించాయి. ఇరు దేశాల మధ్య పరిస్థితుల నేపథ్యంలో తూర్పు, పశ్చిమ తీరాల్లో నావికా దళాన్ని అప్రమత్తం చేసింది భారత్. ఇది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారి గల్వాన్‌లో హింస చెలరేగింది.
ఆ తర్వాత నుంచి గల్వాన్, షాయోక్ నదీ సంగమ ప్రాంతం తమ అధీనంలో ఉంటూ వస్తోందని నెమ్మదిగా వివాదాన్ని ప్రారంభించింది చైనా. ఇక్కడ ఎన్నో ఏళ్లుగా తాము గస్తీ నిర్వహిస్తున్నామని అబద్ధాలు చెబుతోంది.
చర్చలకు ప్రతిపాదన..
ఏప్రిల్ నుంచి కొనసాగుతున్న సరిహద్దు వివాదంలో చైనా చేసిన ఈ ప్రకటన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. గల్వాన్‌పై వివాదాన్ని రాజేస్తూనే పరిష్కారానికి చర్చలకు ప్రతిపాదనలు చేసింది చైనా. సైనిక కమాండర్ స్థాయి చర్చలు జరగాల్సిందేనని పట్టుబడుతోంది.
చైనా ఆరోపణలు ఇవీ..
గల్వాన్‌లో హద్దులను భారత్ ఏకపక్షంగా మారుస్తోందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ ఆరోపించారు. "గల్వాన్ లోయ వాస్తవాధీన రేఖకు చైనా వైపున ఉంది. చాలా ఏళ్లుగా ఇక్కడ గస్తీ నిర్వహిస్తూ చైనా బలగాలు తమ విధులను సాధారణంగానే నిర్వర్తిస్తున్నాయి." అని లిజియాన్ ప్రకటించారు.
చైనా ప్రకటనకు ఆ దేశ అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ వంతపాడుతూ వస్తోంది. గల్వాన్ లోయపై పూర్తి సార్వభౌమాధికారం ఉందని వెస్టర్న్ కమాండ్ అధికార ప్రతినిధి కర్నల్ ఝాంగ్ షూలీ ప్రకటించినట్లు గ్లోబల్ టైమ్స్ జూన్ 16న వెల్లడించింది. చైనా లేవనెత్తుతున్న కొత్త వివాదానికి గల ప్రాముఖ్యాన్ని ఈటీవీ భారత్ అదే రోజు నొక్కి చెప్పింది.