చిన్నారులపై కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది చైనా ప్రభుత్వం. ఆన్లైన్ గేమింగ్ సమయంపై పరిమితులు(china online games limit) విధించింది. మైనర్లు ఇకపై శుక్ర, శని, ఆదివారాల్లోనే ఆన్లైన్ గేమ్స్ ఆడుకునే వీలు ఉంటుంది. అది కూడా రోజుకు.. రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్యే.
ఇలా ఆన్లైన్ గేమ్స్ ఆడుకునే సమయాన్ని వారానికి మూడు గంటలకే పరిమితం చేస్తూ నిబంధన తీసుకొచ్చింది చైనా సర్కారు. సెప్టెంబర్ 1 నుంచి ఈ రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు నేషనల్ ప్రెస్ అండ్ పబ్లికేషన్ అడ్మనిస్ట్రేషన్ నోటీసులో వెల్లడైంది.
ఇలాంటి నిబంధనలు 2019లోనే తీసుకొచ్చింది చైనా. దీని ప్రకారం వీకెండ్ రోజుల్లో గంటన్నర, పబ్లిక్ హాలీడే రోజుల్లో మూడు గంటలు ఆడుకునే వీలుంది. అయితే, తాజా నిబంధనల ప్రకారం వీకెండ్‌తో పాటు సెలవు రోజుల్లోనూ ఆడుకునే సమయం గంటకే పరిమితం కానుంది.
షేర్లు పతనం
తాజా నిబంధనలు గేమింగ్ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేయనున్నాయి. ప్రముఖ టెక్నాలజీ సంస్థలైన టెన్సెంట్, నెట్ఈజ్(netease games)లపై ఈ ప్రభావం ప్రత్యక్షంగా కనిపించింది. న్యూయార్క్‌లో లిస్ట్ అయిన నెట్ఈజ్ స్టాక్.. సోమవారం ట్రేడింగ్ ఆరంభంలోనే 9శాతం(netease share price) పడిపోయింది. హాంకాంగ్ మార్కెట్లో టెన్సెంట్ షేరు 0.6 శాతం(tencent share price) పడిపోయింది. అయితే, మార్కెట్ ముగిసిన తర్వాత ఈ ప్రకటన వచ్చిన నేపథ్యంలో టెన్సెంట్ షేర్లపై ప్రభావం పెద్దగా కనిపించలేదు.
అంతకుముందు, టెన్సెంట్ సంస్థ స్వయంగా చిన్నారులపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. మైనర్లకు రోజుకు గంట, సెలవు రోజుల్లో రెండు గంటలు మాత్రమే ఆడుకునే వీలు కల్పిస్తున్నట్లు తెలిపింది. 12 ఏళ్ల లోపు వారికి గేమ్‌లలో కొనుగోళ్లు జరపకుండా నిషేధం విధించింది.
ఆంక్షలకు కారణం!
సాంకేతిక సంస్థలను అణగదొక్కడంలో భాగంగానే ఈ ఆంక్షలు తీసుకొచ్చినట్లు నిపుణులు ఆరోపిస్తున్నారు. గతంలోనూ ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంది చైనా. పోటీతత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని పేర్కొంటూ ఈ-కామర్స్, ఆన్లైన్ ఎడ్యుకేషన్ సంస్థలపై ఆంక్షలు విధించింది. లాభాపేక్షతో నడుస్తున్న ఎడ్యుకేషన్ సంస్థలపై గత నెలలోనే నిషేధం విధించింది.
ఇదీ చదవండి:టాటూగా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్.. యువకుడి వింత ఆలోచన!