చైనా.. మార్స్ (అంగారక గ్రహం)పై తన తొలి ప్రయోగాన్ని విజయవంతంగా ప్రారంభించింది. తియన్వెన్-1(క్యూయెస్ట్ ఫర్ హెవెన్లీ ట్రూత్-1) పేరుతో ఈ మార్స్ మిషన్‌ను హైనాన్ రాష్ట్రంలోని వెన్చాంగ్ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి నింగిలోకి పంపినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ మిషన్ ప్రారంభమైన 36 నిమిషాలకు.. భూమి నుంచి అంగారకుడికి బదిలీ చేసే కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు చైనా జాతీయ అంతరిక్ష పాలనావిభాగం (సీఎన్ఎస్ఏ) తెలిపింది.
భౌగోళిక దర్యాప్తే లక్ష్యంగా..
రెడ్ ప్లానెట్‌పై సమగ్ర పరిశీలన, మార్టియన్ నేలపై ల్యాండింగ్, ల్యాండ్ అయిన పరిసర ప్రాంతాలలో తిరిగేందుకు అనుగుణంగా రోవర్‌ను పంపించింది. అంతేకాకుండా అక్కడి ఉపరితలంపై శాస్త్రీయ దర్యాప్తు, భౌగోళిక నిర్మాణం, పర్యావరణం, వాతావరణ పరిస్థితులతో సహా.. నీటి జాడ వంటి తదితర అంశాలపై పరిశోధనలు చేస్తుందని స్థానిక మీడియా పేర్కొంది.