వాతావరణ పరిశీలనల కోసం చైనా సోమవారం విజయవంతంగా ఒక అధునాతన ఉపగ్రహాన్ని ప్రయోగించింది. దీనివల్ల ముందస్తు వాతావరణ హెచ్చరికల సామర్ధ్యం పెరగడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా మంచు విస్తీర్ణం, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను పర్యవేక్షించడానికి వీలు కలుగుతుంది. జియుక్వాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి లాంగ్ మార్చ్-4సి రాకెట్ ద్వారా ఈ ప్రయోగం జరిగింది.
ఫెంగ్‌యున్-3ఇ అనే ఈ ఉపగ్రహంలో 11 రిమోట్ సెన్సింగ్ ఉపకరణాలు ఉన్నాయి. ఈ శాటిలైట్‌కు ఒక ప్రత్యేకత ఉంది. రోజూ ఉదయాన్నే భూమిపై నిర్దిష్ట ప్రాంతాన్ని ఇది పరిశీలిస్తుంది. సాయంత్రం వేళ భూమి అవతలి వైపునకు వెళుతుంది. దీనివల్ల సూర్యోదయం, సూర్యాస్తమయం వేళ సంభవించే కీలక ఘట్టాలను నమోదు చేయడానికి వీలవుతుంది. తద్వారా చైనా, మిగతా దేశాలకు సంబంధించి మరింత కచ్చితమైన డేటాను పొందొచ్చని అంతరిక్ష విశ్లేషకులు తెలిపారు. పౌర అవసరాల కోసం ఇలాంటి కక్ష్యలో వాతావరణ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారని చెప్పారు. 8 ఏళ్ల పాటు ఈ శాటిలైట్ సేవలు అందిస్తుంది. వాతావరణంలో ఉష్ణోగ్రత, తేమ, ఇతర వివరాలను సేకరిస్తుంది. తద్వారా విపత్తులపై సమర్థ ముందస్తు హెచ్చరికలు చేయడానికి వీలవుతుంది. సౌర, అంతరిక్ష వాతావరణాలనూ ఇది పరిశీలిస్తుంది.