మార్స్‌పై చైనాప్రయోగించిన తొలి అంతరిక్ష నౌక తియాన్వెన్-1.. అంగారక గ్రహాన్ని తాకినట్టు చైనా నేషనల్ స్పేస్ అడ్మనిస్ట్రేషన్(సీఎన్ఎస్ఏ) శనివారం ప్రకటించింది. ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ కలిగిఉన్న తియన్వెన్-1ను.. గతేడాది జులై 23న ప్రయోగించింది ఆ దేశం.
దాదాపు ఏడు నెలల సుదీర్ఘ ప్రయాణం అనంతరం.. గత ఫిబ్రవరిలో ఈ నౌక మార్స్ కక్ష్యలోకి ప్రవేశించినట్టు చైనా వార్తా సంస్థ తెలిపింది. ఆ తర్వాత.. అక్కడ ల్యాండింగ్ పరిస్థితుల్ని పరిశీలించేందుకు సుమారు రెండు నెలల సమయం పట్టిందని వెల్లడించింది. ప్రస్తుతం.. ఈ రోవర్ అంగారక గ్రహంపై భూగర్భ జలాలు, ప్రాచీన నాగరికత వంటి అంశాలపై అధ్యయనం చేసేందుకు మూడు నెలలపాటు అక్కడ పనిచేస్తుందని సీఎన్ఎస్ఏ భావిస్తోంది.
అంగారక కక్ష్యాన్వేషణ, ల్యాండింగ్, రోవింగ్ చేయాలనే లక్ష్యంతో.. సౌర వ్యవస్థపై అన్వేషించే దిశగా.. ప్రస్తుతం తమ తొలిదశ ప్రయోగాలు కొనసాగుతన్నాయని సీఎన్ఎస్ఏ వెల్లడించింది.