కరోనా మహమ్మారి పుట్టినిల్లు చైనాలో కేసులు(Covid in China) తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తున్నాయి. దీంతో కేసులను నియంత్రించేందుకు అక్కడి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఒకరిద్దరికి పాజిటివ్‌గా నిర్ధరణ అయినా.. వేల మందికి పరీక్షలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉత్తర చైనాలోని హార్బిన్ పట్టణానికి చెందిన మూడు పిల్లులకు పాజిటివ్‌గా తేలడం వల్ల వాటిని అధికారులు చంపేశారు. కరోనా సోకిన జంతువులకు చికిత్స లేకపోవడం.. వాటి ద్వారా యజమానులు, అపార్ట్‌మెంట్ వాసులకు ప్రమాదం పొంచిఉన్న కారణంగా తప్పని పరిస్థితుల్లో వాటిని అధికారులు చంపాల్సి వచ్చిందని చైనా అధికారిక మీడియా వెల్లడించింది.
ఆ పెంపుడు పిల్లుల యజమానికి సెప్టెంబర్ 21న వైరస్ నిర్ధరణ కాగా, ఆమె ఐసోలేషన్‌లో ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆమె పెంచుకుంటున్న మూడు పిల్లులకు వైద్యాధికారులు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. మనుషులకు మాత్రమే సోకే కరోనా వైరస్.. కొన్ని సందర్భాల్లో మానవుల ద్వారా జంతువులకు కూడా సోకే అవకాశం ఉందని అమెరికా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం(సీడీసీ) పేర్కొంది. అందుకే కరోనా సోకినా, లక్షణాలు బయటపడినా పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలని సీడీసీ సూచిస్తోంది.