రెండు దశాబ్దాల పాటు అఫ్గాన్‌కు పెద్దన్నగా వ్యవహరించి.. ఉగ్రవాదంపై సుదీర్ఘ పోరాటం చేసింది అమెరికా. కానీ ఒక్కసారిగా తమ బలగాలను పూర్తిస్థాయిలో ఉపసంహరించుకుని(america evacuation).. అఫ్గాన్ సంక్షోభానికి తెరతీసింది. అమెరికా వెనుదిరగడాన్ని అవకాశంగా చూసిన చైనా.. ఇప్పుడు అఫ్గాన్‌పై పెద్దన్న పాత్ర పోషించేందుకు సిద్ధపడుతోంది(china afghanistan). అగ్రరాజ్యం వైదొలిగిన అనంతరం ఏర్పడిన ఖాళీని చైనా భర్తీ చేయాలని యోచిస్తోంది. మధ్య ఆసియాలో ఆధిపత్యం చలాయించాలనే తన కలను నెరవేర్చుకోవాలని ప్రయత్నిస్తోంది.
ఈ క్రమంలోనే అనేకమార్లు అమెరికాపై విరుచుకుపడింది. తాలిబన్లు అఫ్గాన్‌ను(Afghanistan Taliban) ఆక్రమించుకున్న తొలినాళ్లలో అమెరికా విమానం నుంచి ప్రజలు జారిపడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వాటిపై వెంటనే స్పందించిన చైనా.. విమర్శలు గుప్పించింది. అఫ్గాన్ శరణార్థులను తరలించటంలో అమెరికాకు సరైన వ్యూహం లేదని ఆరోపించింది.
అంతర్జాతీయ విశ్లేషణ వెబ్సైట్ 'ఇన్సైడ్ఓవర్'కు రాసిన వ్యాసంలో.. ఫెడెరికో గియులియాని అనే రచయిత చైనా వ్యూహాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పొరుగు దేశం నుంచి అమెరికా వైదొలగటం పట్ల బీజింగ్ సంతోషంగా ఉందన్నారు.
"మధ్య ఆసియాలో తన ఆధిపత్యం కోసం బీజింగ్ సుదీర్ఘకాలంగా ప్రయత్నిస్తోంది. రష్యాతో పాటు షాంఘై సెంట్రల్ ఆర్గనైజేషన్ ద్వారా ప్రాంతీయ గతిశీలతను మార్చాలని భావిస్తోంది. అయితే.. చాలా కాలంగా తన ప్రణాళికల్లో అఫ్గానిస్థాన్ లేదు. నిజానికి అఫ్గానిస్థాన్‌లో అమెరికా బలగాల మోహరింపు ఓ విధంగా చైనాకు అవసరమైన భద్రతా, దాని ఆర్థిక వ్యవస్థను విస్తరించడానికి ఉపయోగపడింది. కానీ అమెరికా, ఇతర దేశాలతో కలిసి పనిచేసేందుకు బీజింగ్ ఎప్పుడూ ముందుకు రాలేదు. పాశ్చాత్య దేశాల నిష్క్రమణ ఇప్పుడు అఫ్గానిస్థాన్‌పై చైనా తన ముద్ర వేయడానికి అవసరమైన మార్గాన్ని అందించింది."